ఆ అవార్డుకు మళ్లీ నామినేట్ అయిన స్మృతి మంధాన.. గెలిస్తే తొలి క్రీడాకారిణిగా రికార్డు

by Harish |

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి ఐసీసీ మంత్లీ అవార్డుపై కన్నేసింది.

ఆ అవార్డుకు మళ్లీ నామినేట్ అయిన స్మృతి మంధాన.. గెలిస్తే తొలి క్రీడాకారిణిగా రికార్డు
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి ఐసీసీ మంత్లీ అవార్డుపై కన్నేసింది. సెప్టెంబర్‌ నెలకు సంబంధించి స్మృతినే అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అక్టోబర్ నెలకు సంబంధించిన అవార్డు కోసం కూడా పోటీపడుతోంది. ఐసీసీ గురువారం అవార్డు నామినీలను ప్రకటించింది. రేసులో స్మృతితోపాటు సౌతాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్ట్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గార్డ్‌నెర్ ఉన్నారు. ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా వరల్డ్ కప్ సాధించడంలో స్మృతి కీలక పాత్ర పోషించింది. 9 మ్యాచ్‌ల్లో 434 రన్స్ చేసి సెకండ్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. అందులో అక్టోబర్‌లో 7 మ్యాచ్‌లు ఆడగా 381 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాపై(80 రన్స్), ఇంగ్లాండ్‌పై(88) రాణించిన ఆమె న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగింది. వరల్డ్ కప్‌లో ఆమె ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డుకు ఎంపిక చేసింది. కాగా, ఐసీసీ మంత్లీ అవార్డును ఇప్పటికే స్మృతి రెండుసార్లు(జూన్ 2024, సెప్టెంబర్ 2025) గెలిచింది. మూడో అవార్డు కూడా దక్కితే ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా స్మృతి రికార్డు సృష్టిస్తుంది.


Next Story