సిన్నర్ వర్సెస్ అల్కరాజ్.. వింబుల్డన్ ఫైనల్!

by Phanindra |

వింబుల్డన్ ఫైనల్‌లో సిన్నర్ వర్సెస్ అల్కరాజ్. సెమీస్‌లో జకోవిక్‌ను సిన్నర్ ఓడించాడు.

సిన్నర్ వర్సెస్ అల్కరాజ్.. వింబుల్డన్ ఫైనల్!
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచంలోని అత్యంత పురాతనమైన గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌లో ఉత్కంఠభరితమైన ఫైనల్‌కు వేదిక సిద్ధమైంది. కొన్నిరోజుల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కోసం తలపడిన జానిక్ సిన్నర్, కార్లోస్ అల్కరాజ్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ఢీకొనబోతున్నారు. సెమీస్‌లో అద్భుతమైన విజయాలు సాధించిన వీళ్లిద్దరూ వింబుల్డన్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. గత రెండు వింబుల్డన్ టైటిల్స్ నెగ్గిన అల్కరాజ్.. ముచ్చటగా మూడోసారి కూడా నెగ్గి, ఈ ఘనత సాధించిన ఐదో టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాలని తహతహలాడుతున్నాడు. అదే సమయంలో ప్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు కెరీర్లో తొలి వింబుల్డన్ టైటిల్‌ తన ఖాతాలో వేసుకోవాలని వరల్డ్ నెంబర్ వన్ జానిక్ సిన్నర్ ఉవ్విళ్లూరుతున్నాడు.

జకోవిక్‌పై పైచేయి..

శుక్రవారం నాడు సెంటర్ కోర్ట్‌లో జరిగిన రెండో సెమీఫైనల్‌లో లెజెండరీ ప్లేయర్ నొవాక్ జకోవిక్‌ను సిన్నర్ చిత్తుగా ఓడించాడు. జకోకు ఏమాత్రం అవకాశం ఇవ్వని సిన్నర్.. 6-3, 6-3, 6-4 తేడాతో వరుస సెట్లను తన ఖాతాలో వేసుకొని వింబుల్డన్ ఫైనల్స్‌కు దూసుకొచ్చాడు. 2017 తర్వాత వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకోలేకపోవడం జకోకు ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఆరో ఫైనల్‌కు అల్కరాజ్..

అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచులో అల్కరాజ్‌ కూడా ధాటిగా ఆడాడు. యూఎస్‌కు చెందిన టేలర్ ఫ్రిట్జ్‌తో జరిగిన ఈ మ్యాచులో 6-4, 5-7, 6-3, 6-1 తేడాతో అల్కరాజ్ విజయం సాధించి.. తన కెరీర్లో ఆరో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. ఆదివారం జరిగే ఫైనల్లో సిన్నర్‌తో తాడోపేడో తేల్చుకోనున్నాడు. ఇప్పటి వరకు ఒక్క ఫైనల్లో కూడా ఓటమి లేని అల్కరాజ్.. ఈ రికార్డును కొనసాగిస్తాడా? లేదా? చూడాలి.

మహిళల ఫైనల్

వింబుల్డన్ మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచులు శనివారం నాడు జరగనున్నాయి. మహిళల సింగిల్స్‌లో అనిసిమోవా, స్వియటెక్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. అలాగే పురుషుల డబుల్స్‌లో రింకీ హిజికటా, డేవిడ్ పేల్-జూలియన్ క్యాష్, లాయిడ్ గ్లాస్‌పూల్ జోడీలు టైటిల్ కోసం తలపడనున్నాయి.

Next Story