గిల్ డబుల్.. భారత్ 587 రన్స్‌కు ఆలౌట్.. మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్!

by Phanindra |   (  Updated:2025-07-04 12:49:20  IST  )

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. భారత్ 587 రన్స్‌కు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది.

గిల్ డబుల్.. భారత్ 587 రన్స్‌కు ఆలౌట్.. మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్!
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా బ్యాటర్లు ఇరగదీశారు. 2007 తర్వాత తొలిసారి టెస్టుల్లో తొలి ఇన్నింగ్సులో 500+ స్కోరుతో అదరగొట్టారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269) చరిత్రాత్మక ఇన్నింగ్సుతో మెరిశాడు. అతనికి రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) చక్కటి సహకారం అందించారు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను తిరగరాసిన గిల్.. ట్రిపుల్ సెంచరీ చేయకపోవడం ఒకింత బాధాకరం. కానీ క్రీజులో ఉన్నంతసేపూ ఆటను తనే కమాండ్ చేసిన తీరు మాత్రం భవిష్యత్తుపై ధీమా పెంచుతోంది. భారత బౌలర్లు కూడా కట్టుదిట్టంగానే ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. మూడో రోజు వాళ్లు రాణిస్తే మ్యాచ్ టీమిండియాదే.

ఎడ్జ్‌బాస్టన్ టెస్టు రెండో రోజు ఆటలో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించిందనే చెప్పాలి. 310/5 స్కోరుతో ఆటను ప్రారంభించిన భారత్‌ను గిల్, జడేజా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. ఎటాకింగ్ ఆటతో వేగంగా పరుగులు చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీళ్లిద్దరూ ఏకంగా 203 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఎట్టకేలకు 414 పరుగుల స్కోరు వద్ద జడ్డూను టంగ్ పెవిలియన్ చేర్చాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ (42) కూడా చాలా జాగ్రత్తగా ఆడాడు. గిల్ కూడా అద్భుతమైన ఆటతో డబుల్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత కూడా గిల్ ధాటిగానే ఆడటంతో తొలిసారి ఇంగ్లండ్ గడ్డపై భారత ప్లేయర్ ట్రిపుల్ సెంచరీ చేస్తాడని అంతా ఆశించారు. కానీ టీ బ్రేక్ తర్వాత జోష్ టంగ్ వేసిన షార్ట్‌బాల్‌ను సరిగా ఆడలేక 269 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ వెనుతిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వోక్స్, టంగ్ రెండేసి వికెట్లు తీసుకోగా.. రూట్, కార్సె, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. భారత జట్టు తొలి ఇన్నింగ్సులో 587 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా చేసిన రెండో అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం.

బౌలింగ్‌లో కూడా భారత్‌కు అదిరే ఆరంభం లభించిందనే చెప్పాలి. లేక లేక అవకాశం రావడంతో దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఆకాష్ దీప్ (2/36), సిరాజ్ (1/21) ఆరంభంలోనే టీమిండియాకు బ్రేక్ ఇచ్చారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే డకెట్ (0), పోప్ (0) ఇద్దర్నీ అవుట్ చేశాడు ఆకాష్. ఆ తర్వాత కాసేపటికే 8వ ఓవర్ తొలి బంతికి క్రాలీ (19)ని పెవిలియన్ చేర్చాడు సిరాజ్. అయితే ఆ తర్వాత జో రూట్ (18 నాటౌట్), హ్యారీ బ్రూక్ (30 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 77 పరుగులతో నిలిచింది.


స్కోరుబోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్ : 587 ఆలౌట్

యశస్వి జైశ్వాల్(సి)జేమీ స్మిత్(బి)స్టోక్స్ 87, రాహుల్(బి)క్రిస్ వోక్స్ 2, కరుణ్ నాయర్(సి)హ్యారీ బ్రూక్(బి)బ్రైడెన్ కార్సే 31, శుభ్‌మన్ గిల్(సి)పోప్(బి)టంగ్ 269, పంత్(సి)జాక్ క్రాలీ(బి)షోయబ్ బషీర్ 25, నితీశ్(బి)క్రిస్ వోక్స్ 1, జడేజా(సి)స్మిత్(బి)టంగ్ 89, సుందర్(బి)రూట్ 42, ఆకాష్ దీప్(సి)డకెట్(బి)బషీర్ 6, సిరాజ్(స్టంప్స్)స్మిత్(బి)బషీర్ 8, ప్రసిద్ధ్ కృష్ణ 5 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు 22.

వికెట్ల పతనం : 15-1, 95-2, 161-3, 208-4, 211-5, 414-6, 558-7, 574-8, 574-9, 587-10

బౌలింగ్ : క్రిస్ వోక్స్(25-6-81-2), బ్రైడెన్ కార్సే(24-3-83-1), జోష్ టంగ్(28-2-119-2), బెన్ స్టోక్స్(19-0-74-1), షోయబ్ బషీర్(45-2-167-3), జోరూట్(5-0-20-1), హ్యారీ బ్రూక్(5-0-31-0)

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 77/3 (20 ఓవర్లలో)

జాక్ క్రాలీ(సి)నాయర్(బి)సిరాజ్ 19, డకెట్(సి)గిల్(బి)ఆకాష్ 0, పోప్(సి)రాహుల్(బి)ఆకాష్ 0, జో రూట్ 18 బ్యాటింగ్, హ్యారీ బ్రూక్ 30 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు 10.

వికెట్ల పతనం: 13-1, 13-2, 25-3

బౌలింగ్: ఆకాష్ దీప్(7-1-36-2), మహమ్మద్ సిరాజ్ (7-2-21-1), ప్రసిద్ధ్ కృష్ణ (3-0-11-0), నితీష్ కుమార్ రెడ్డి (1-0-1-0), రవీంద్ర జడేజా (2-1-4-0)

Next Story