శ్రేయస్ అయ్యర్ వచ్చేస్తున్నాడు.. మూడు నెలల తర్వాత రేపు గ్రౌండ్‌లోకి..

by Harish |

ఆస్ట్రేలియా టూరులో గాయపడి ఆటకు దూరమైన భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు.

శ్రేయస్ అయ్యర్ వచ్చేస్తున్నాడు.. మూడు నెలల తర్వాత రేపు గ్రౌండ్‌లోకి..
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా టూరులో గాయపడి ఆటకు దూరమైన భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. అతను న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. అంతకుముందే అయ్యర్ దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటాడు. ముంబై తరపున రెండు మ్యాచ్‌‌లు ఆడనున్నాడు. మూడు నెలల తర్వాత పునరాగమనం చేయబోతున్న అతను మంగళవారం హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. ఈ నెల 8న పంజాబ్‌తో జరిగే గేము కూడా ఆడనున్నాడు. ఈ రెండు మ్యాచ్‌లకు అతన్ని కెప్టెన్‌గా నియమించినట్టు ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) సోమవారం వెల్లడించింది. ముంబై రెగ్యులర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ఎంసీఏ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది.

ఈ రెండు మ్యాచ్‌లు అయ్యర్‌కు కీలకం కానున్నాయి. కివీస్‌తో పోరుకు అతన్ని ఎంపిక చేసినప్పటికీ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇస్తేనే అతను ఆడతాడు. కాబట్టి, విజయ్ హజారే ట్రోఫీలో అతను ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్‌ పునరాగమనానికి అవసరమైన ఫిట్‌నెస్ సాధిస్తే విజయ్ హజారే ట్రోఫీలో నాకౌట్ రౌండ్‌కు ముంబై కొత్త కెప్టెన్‌ను నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం టోర్నీలో ముంబై గ్రూపు సిలో నాలుగు విజయాలతో రెండో స్థానంలో ఉంది. తర్వాతి రౌండ్‌కు చేరుకోవడానికి ఆ జట్టుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.


Next Story