ఆ జట్టుతో ఒప్పందం చేసుకున్న శార్దూల్ ఠాకూర్

by Harish |

జాతీయ జట్టులో చోటు కోల్పోయిన భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ దేశవాళీలో సత్తాచాటుతున్నాడు.

ఆ జట్టుతో ఒప్పందం చేసుకున్న శార్దూల్ ఠాకూర్
X

దిశ, స్పోర్ట్స్ : జాతీయ జట్టులో చోటు కోల్పోయిన భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ దేశవాళీలో సత్తాచాటుతున్నాడు. రంజీ ట్రోఫీలో ముంబైకి ఆడుతున్న అతను 439 రన్స్ చేయడంతోపాటు 34 వికెట్లు తీశాడు. అయితే, చాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అతన్ని సెలెక్ట్ చేయలేదు. అలాగే, ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ ఆసక్తిచూపించకపోవడంతో అతను ఈ సీజన్‌కు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో శార్దూల్ ఈ సీజన్‌లో కౌంట్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌‌లో ఎసెక్స్‌ జట్టుకు ఆడబోతున్నాడు. ఈ మేరకు ఎసెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఎసెక్స్ మంగళవారం ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది.

కౌంటీ క్రికెట్ ఆడటం శార్దూల్‌కు ఇదే తొలిసారి. ఈ టోర్నీలో అతను 7 మ్యాచ్‌లు ఆడనున్నాడు. తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడానికి శార్దూల్ కౌంటీ చాంపియన్‌షిప్‌ను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. జూన్‌లో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ‘ఈ వేసవిలో ఎసెక్స్‌లో చేరడానికి ఉత్సాహంగా ఉన్నా. వ్యక్తిగతంగా ఇది నాకు నా ప్రతిభను, నైపుణ్యాలను ప్రదర్శించడానికి సవాళ్లు, అవకాశాలను ఇస్తుంది. కౌంటీ క్రికెట్ ఆడాలని ఎప్పటి నుంచ అనుకుంటున్నా. ఈగిల్స్‌‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది.’ అని శార్దూల్ చెప్పుకొచ్చాడు. కాగా, శార్దూల్ చివరిసారిగా 2023లో టీమిండియా తరపున సౌతాఫ్రికాతో టెస్టు ఆడాడు.


Next Story