భారత్ విజయంపై షాహిద్ అఫ్రిది అక్కసు.. టీమిండియాకు థర్డ్ అంపైర్‌ అనుకూలంగా ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు

by Harish |   (  Updated:2025-09-24 13:00:14  IST  )

ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ టీమిండియా చేతిలో రెండు మ్యాచ్‌ల్లో చిత్తయ్యింది.

భారత్ విజయంపై షాహిద్ అఫ్రిది అక్కసు.. టీమిండియాకు థర్డ్ అంపైర్‌ అనుకూలంగా ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ టీమిండియా చేతిలో రెండు మ్యాచ్‌ల్లో చిత్తయ్యింది. మొదటిసారి గ్రూపు దశ మ్యాచ్‌లో ఓడిన బాధలో ఉన్న ఆ జట్టు.. ఆదివారం సూపర్-4 మ్యాచ్‌లోనూ పరాజయం పాలవడంతో పుండు మీద కారం చల్లినట్టైంది. మైదానంలో గెలిచే దమ్ము లేక పాక్ ప్లేయర్లు నోటికి పనిచెబుతున్నారు. తొలి మ్యాచ్‌లో హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడాన్ని నానా రాద్ధాంతం చేశారు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తొలగించాలని పట్టుబట్టింది. ఐసీసీ లైట్‌గా తీసుకోవడమే కాకుండా అందులో అతని తప్పేం లేదంటూ పాక్ బోర్డుకు షాకిచ్చింది. సూపర్-4 మ్యాచ్‌లోనూ ఓడటంతో పాక్ ప్లేయర్లు ఈ సారి థర్డ్ అంపైర్‌పై అబండాలు మోపారు. పాండ్యా వేసిన 3వ ఓవర్‌లో ఫకర్ జమాన్ బంతిని ఆడబోయి వికెట్ కీపర్‌ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చాడు. రివ్యూలో ఫకర్ అవుటని థర్డ్ అంపైర్ తేల్చాడు.

పలు యాంగిల్స్‌లో సమీక్షించిన తర్వాత బంతి నేలకు తాకలేదని, బంతి కింద శాంసన్ వేళ్లు ఉన్నాయని తేల్చాడు. అయితే, బంతి నేలకు తాకిందని పాక్ మాజీ క్రికెటర్లు వాదిస్తున్నారు. భారత్‌పై అక్కసువెల్లగక్కేందుకు ముందు ఉండే పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది.. ఫకర్ జమాన్ అవుట్‌పై థర్డ్ అంపైర్ చిత్తశుద్ధిని ప్రశ్నించాడు. థర్డ్ అంపైర్ భారత్‌‌కు అనుకూలంగా వ్యవహరించాడని కామెంట్స్ చేశాడు. ఐపీఎల్‌లో అంపైరింగ్ కోసం అలా చేశాడంటూ అర్థం లేని మాటలు మాట్లాడాడు. మరో పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్ కూడా అందుకు వంత పాడాడు. చాలా యాంగిల్స్‌లో చూడలేదన్నాడు. మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ‘ఫకర్ నాటౌట్. 26 కెమరాలు ఉన్నాయి. థర్డ్ అంపైర్ కేవలం రెండు యాంగిల్స్ మాత్రమే ఎందుకు చెక్ చేశారు. అప్పుడు ఫకర్ అవుట్ కాకపోతే మ్యాచ్ మలుపు తిరిగేది’అని వ్యాఖ్యానించాడు. రీప్లేలో బంతి కింద శాంసన్ వేళ్లు ఉన్నట్టు స్పష్టంగా కనిపించినా పాక్ మాజీ ప్లేయర్లు థర్డ్ అంపైర్‌పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. గెలవలేక ఇలా ఆరోపణలు చేయడం పాక్‌కు కొత్తేం కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story