Team India: టెస్ట్ కెప్టెన్సీ అడిగిన సీనియర్ ప్లేయర్.. నో చెప్పేసిన గంభీర్!

by Phanindra |   (  Updated:2025-05-05 15:22:34  IST  )

టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగిస్తే ఆ స్థానం తనకివ్వాలని ఒక సీనియర్ ప్లేయర్ అడిగితే.. కోచ్ గంభీర్ నో చెప్పేశాడట.

Team India: టెస్ట్ కెప్టెన్సీ అడిగిన సీనియర్ ప్లేయర్.. నో చెప్పేసిన గంభీర్!
X

దిశ, స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. ఈ క్రమంలో అందరి దృష్టి ఐపీఎల్ తర్వాత జరిగే భారత్-ఇంగ్లండ్ సిరీస్ మీద పడింది. ఈ సిరీసుతోనే టీమిండియా (Team India) కొత్త డబ్ల్యూటీసీ సైకిల్‌ను ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టూర్ నుంచే భవిష్యత్తుకు ప్రణాళికలు రచించాలని బీసీసీఐ భావిస్తోంది. ముఖ్యంగా టెస్టు కెప్టెన్సీలో మార్పులు చేయాలని బీసీసీఐ పెద్దలు అనుకుంటున్నారట. అయితే టెస్టుల్లో కెప్టెన్సీ వదులుకోవాలనే ఆలోచన తనకు లేదని, ఇంకొంత కాలం కెప్టెన్‌గా కొనసాగాలని అనుకుంటున్నానని బీసీసీఐ పెద్దలకు రోహిత్ శర్మ (Rohit Sharma) విన్నవించినట్లు సమాచారం.

కానీ కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ నుంచి ఫ్యూచర్‌పై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్న బీసీసీఐ.. కొత్త కెప్టెన్‌ను తీసుకురావడానికి ఇంగ్లండ్ టూర్ (England Tour) సరైన వేదిక అని భావిస్తోందట. ఈ టైంలో తనకు ఒక అవకాశం ఇస్తే కెప్టెన్‌గా రాణిస్తానని కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లను ఒక సీనియర్ ప్లేయర్ కోరాడట. అయితే వీళ్లిద్దరూ కూడా ఆ ప్లేయర్‌ను కెప్టెన్ చెయ్యడం కుదరదంటే కుదరదని కరాఖండీగా చెప్పేసినట్లు సమాచారం. ఫ్యూచర్ కోసం ఎవరైనా కుర్రాడినే కెప్టెన్‌గా చేయాలనుకుంటున్నామని, ఇలా కొంత కాలం కోసం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తమకు ఇష్టంలేదని వీళ్లిద్దరూ చాలా స్పష్టంగా ఆ సీనియర్ ప్లేయర్‌కు చెప్పేశారట. ఈ నేపథ్యంలో ఆ సీనియర్ ప్లేయర్ ఎవరు? అనే చర్చ ఊపందుకుంది. కొంతమంది కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా పేర్లు చెప్తుంటే.. మరికొందరేమో రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ పేర్లు కూడా చెప్తున్నారు.

అయితే బీసీసీఐ మాత్రం వీరందర్నీ కాదని శుభ్‌మన్ గిల్‌ను (Subhman Gill) టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా నియమించాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న గిల్.. అంత గొప్పగా రాణించడం లేదు. మరీ ముఖ్యంగా విదేశాల్లో గిల్ రికార్డు అంత గొప్పగా లేదు. అలాంటి ఆటగాడిని కెప్టెన్‌గా చేయడం ఎంతవరకు సబబు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఇంగ్లండ్ సిరీస్ టీమిండియాకు చాలా ముఖ్యమని, గిల్ కనుక ఇంగ్లండ్‌లో రాణిస్తే అతన్నే టీమిండియా టెస్ట్ కెప్టెన్ చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. మరి ఇంగ్లండ్‌లో గిల్ ఏం చేస్తాడు? సత్తా చాటి కెప్టెన్సీ అందుకుంటాడా? లేదంటే పేలవ ప్రదర్శనతో పోటీ నుంచి తప్పుకుంటాడా? తెలియాలంటే వేచిచూడక తప్పదు.

Next Story