సూర్య అద్భుతమైన నాయకుడు.. ఎందుకో కారణం చెప్పిన గంభీర్

by Harish |

సూర్య అద్భుతమైన నాయకుడు.. ఎందుకో కారణం చెప్పిన గంభీర్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20ల్లో భారత జట్టును కెప్టెన్ సూర్యకుమార్ అద్భుతంగా నడిపిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా ఎదురులేని శక్తిగా మారింది. ఈ నేపథ్యంలోనే సూర్యకుమార్‌పై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో గంభీర్ మాట్లాడుతూ.. సూర్య అద్భుతమైన కెప్టెన్ అని ప్రశంసించాడు. ‘పురుషుల జట్టుకు అతనో అద్భుతమైన నాయకుడు. మైదానంలో అతను చేసే పనిని బట్టి కాదు. బ్యాటర్‌గా అతని శైలి వల్ల కాదు. అతను ఆడే షాట్ల వల్ల కాదు. అవన్నీ పక్కనపెట్టండి. ప్లేయర్లతో అతను కలిగి ఉన్న సంబంధం, వారితో అతను మాట్లాడే విధానం, మైదానంలో అతను రిలాక్స్ ఉండే తీరు కారణంగా అద్భుతమైన కెప్టెన్ అని చెబుతున్నా.’అని గంభీర్ తెలిపాడు. టీ20ల్లో తన పనిని సూర్య చాలా సులభతరం చేస్తున్నాడని చెప్పాడు. దాని వల్ల తాను మిగతా విషయాలపై ఆలోచించవచ్చని తెలిపాడు. ‘సూర్య కెప్టెన్‌గా అన్ని విషయాలు చూసుకుంటాడు. జట్టు వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతాడు. జట్టు కోసం సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. అతనిలాంటి వ్యక్తి జాతీయ జట్టును నడిపించడం గొప్ప విషయం.’అని సూర్యను గంభీర్ పొగిడాడు.


Next Story