చైనాలో ఓపెన్‌లో సాత్విక్ జోడీ హవా

by Harish |

చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి దూకుడు కొనసాగుతోంది.

చైనాలో ఓపెన్‌లో సాత్విక్ జోడీ హవా
X

దిశ, స్పోర్ట్స్ : చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి దూకుడు కొనసాగుతోంది. పురుషుల డబుల్స్‌లో ఈ భారత జంట సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర ఫైనల్‌లో సాత్విక్ జోడీ 21-18, 21-14 తేడాతో మలేసియాకు చెందిన ఓంగ్ యు సిన్-టియో ఈ యి జంటపై విజయం సాధించింది. 40 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో ప్రత్యర్థులపై భారత షట్లర్లు స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు. తొలి గేములో మలేసియా జంట కాస్త పోటీనిచ్చినప్పటికీ సాత్విక్ ద్వయం వారి ఆటలను సాగనివ్వలేదు. ఇక, రెండో గేములో పూర్తి హవా మన ఆటగాళ్లదే. గతేడాది థాయిలాండ్ ఓపెన్ నెగ్గిన తర్వాత సాత్విక్, చిరాగ్ మరో టైటిల్ గెలవలేదు. ఈ ఏడాది పలు టోర్నీల్లో సెమీస్‌ల్లోనే వెనుదిరిగింది. చైనా ఓపెన్‌లో సెమీస్ అడ్డంకిని దాటి టైటిల్ నిరీక్షణకు తెరదించుతుందో లేదో చూడాలి. మరోవైపు, యువ క్రీడాకారిణి ఉన్నతి హుడా సంచలన పోరాటం ముగిసింది. ఉమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో సింధును మట్టికరిపించిన ఆమె క్వార్టర్స్‌ను దాటలేకపోయింది. జపాన్ షట్లర్ యమగూచి చేతిలో 21-16, 21-12 తేడాతో పరాజయం పాలైంది.

Next Story