పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. సెమీస్ బెర్త్ ఖాయం

by Harish |

పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. సెమీస్ బెర్త్ ఖాయం
X

దిశ, స్పోర్ట్స్ : సౌత్ ఏసియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(శాఫ్) అండర్-20 చాంపియన్‌షిప్ టోర్నీలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. మాల్దీవులులో గురువారం జరిగిన తమ తొలి గ్రూపు మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. ఏకపక్షంగా సాగిన గేములో భారత్ 3-0 తేడాతో విజయం సాధించింది. ఈ విక్టరీతో భారత జట్టు సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మరోవైపు పాక్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. గేము ఆరంభం నుంచి చివరి వరకూ ఇండియాదే ఆధిపత్యం. 3వ నిమిషంలోనే విశాల్ యాదవ్ జట్టుకు తొలి గోల్ అందించాడు. అనంతరం పాక్ జట్టుకు కాస్త పుంజుకున్నట్టు కనిపించింది. గోల్ చేసే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ, భారత గోల్ కీపర్ సురాజ్ సింగ్ గోల్ పోస్టు ముందు అడ్డుగా నిలబడి పాక్ వ్యూహాలను తిప్పికొట్టాడు. సెకండాఫ్‌లో భారత ప్లేయర్ ఒమాంగ్ దోడమ్ అదరగొట్టాడు. 64వ నిమిషంలో ఓ గోల్, 88వ నిమిషంలో మరో గోల్ చేశాడు. దీంతో భారత్ 3-0తో నెగ్గింది. శనివారం రెండో గ్రూపు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.


Next Story