అలా చేసినందుకు పంత్‌కు వార్నింగ్ ఇచ్చిన ఐసీసీ

by Harish |

టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్‌ను ఐసీసీ మందలించింది.

అలా చేసినందుకు పంత్‌కు వార్నింగ్ ఇచ్చిన ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్‌ను ఐసీసీ మందలించింది. అలాగే, ఓ డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అంపైర్‌ నిర్ణయాన్ని విభేదించినందుకు ఐసీసీ చర్యలు తీసుకుంది. పంత్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ను ఉల్లంఘించినట్టు ఐసీసీ తెలిపింది. అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడాన్ని ఐసీసీ నేరంగా పరిగణిస్తుంది.

అసలేం జరిగిందంటే.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో బంతి సరిగా లేదంటూ కొత్త బంతిని ఇవ్వాలని కెప్టెన్ గిల్, బుమ్రా అంపైర్‌ను కోరారు. వారి నిర్ణయాన్ని అంపైర్ తిరస్కరించాడు. 61వ ఓవర్‌లో పంత్ కూడా అంపైర్ వద్దకు వెళ్లాడు. బంతిని బాల్ గాజ్‌తో చెక్ చేయాలన్నాడు. అంపైర్ పాల్ రీఫెల్ బంతిని బాల్ గాజ్‌తో చెక్ చేసి బంతి బాగానే ఉందని చెప్పాడు. అయితే, పంత్ మరోసారి చెక్ చేయాలని అడగ్గా అంపైర్ తిరస్కరించాడు. దీంతో రిషబ్ అసహనానికి గురై అంపైర్ ముందే బంతిని బలంగా విసిరాడు. దీనిని సీరియస్‌గా తీసుకున్న మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాడు. పంత్ కూడా నేరాన్ని అంగీకరించినట్టు ఐసీసీ తెలిపింది. మరోవైపు, తొలి టెస్టులో పంత్ సంచలన ప్రదర్శన చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ(134, 118) శతకాలతో రెచ్చిపోయిన విషయం తెలిసిందే.


Next Story