మలేషియా మాస్టర్స్ నుంచి సింధు అవుట్

by Phanindra |   (  Updated:2025-05-21 19:30:56  IST  )

మలేషియా మాస్టర్స్ తొలి రౌండ్‌లోనే సింధు నిష్క్రమించింది. వియత్నాంకు చెందిన ఎంగుయెన్ చేతిలో పరాజయంతో ఆమె టోర్నీ నుంచి తప్పుకుంది.

మలేషియా మాస్టర్స్ నుంచి సింధు అవుట్
X

దిశ, స్పోర్ట్స్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరోసారి నిరాశపరిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో మొదటి రౌండ్‌‌లోనే ఓడిన ఆమె.. మలేషియా మాస్టర్స్ 2025 టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆక్సియాటా ఎరీనాలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో వియత్నాంకు చెందిన ఎంగుయెన్ తూయ్ లిన్ చేతిలో 21-11, 14-21, 21-15 తేడాతో సింధు ఓటమిపాలైంది. ఇది ఎంగుయెన్ చేతిలో సింధుకు వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. ఈ ఏడాది ఆడిన ఐదు టోర్నీల్లో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించడం సింధుకు ఇది నాలుగోసారి.

ప్రణయ్ సూపర్ విక్టరీ..

ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో హెచ్ ఎస్ ప్రణయ్ అద్భుతం విజయం సాధించాడు. జపాన్‌కు చెందిన ఐదోసీడ్ కెంటా నిషిమోటోతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో 19-21, 21-17, 21-16 తేడాతో ప్రణయ్ విజయఢంకా మోగించాడు. తొలి గేమ్ కోల్పోయినా ఆ తర్వాతి రెండు గేమ్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో మలేషియా మాస్టర్స్ 2025 రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. తదుపరి మ్యాచ్‌లో జపాన్‌కే చెందిన యూషీ తనాకాతో ప్రణయ్ తలపడనున్నాడు.

మరో భారత ప్లేయర్ కిరణ్ జార్జ్ కరుణాకరన్ కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. చైనీస్ తైపీకి చెందిన మూడో సీడ్ చో టైన్ చెన్‌ను 21-13, 21-14 తేడాతో మట్టికరిపించాడు. అలాగే ఆయుష్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్ కూడా రెండో రౌండ్లో అడుగుపెట్టారు.

Next Story