భారత్‌కు భారీ షాక్.. పతకం లేకుండానే సింధు ఇంటిదారి

by Harish |   (  Updated:2025-08-29 13:42:06  IST  )

బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు క్వార్టర్స్‌లోనే ఇంటిదారిపట్టింది.

భారత్‌కు భారీ షాక్.. పతకం లేకుండానే సింధు ఇంటిదారి
X

దిశ, స్పోర్ట్స్ : బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో భారీ షాక్. పతకం తెస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్న స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు ఉత్తచేతులతోనే ఇంటిదారిపట్టింది. వరుసగా మూడు విజయాలతో సత్తాచాటిన ఆమె క్వార్టర్ ఫైనల్‌‌లో నిష్ర్కమించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దాని చేతిలో 21-14, 13-21,21-16 తేడాతో ఓడిపోయింది. గెలుపు కోసం సింధు తీవ్ర ప్రయత్నం చేసింది. గంటకుపైగా పోరాడింది. అయితే, తొలి గేము కోల్పోవడంతోనే వెనుకబడిన ఆమె రెండో గేము నెగ్గి పోటీలోకి వచ్చింది.

కానీ, నిర్ణయాత్మక మూడో గేములో మాత్రం ప్రత్యర్థిని నిలువరించలేకపోయింది. ఒక దశలో 7-5తో ఆధిక్యంలో ఉన్న సింధు ఆ తర్వాత ఇండోనేషియా క్రీడాకారిణి దూకుడు ముందు నిలువలేకపోయింది. సింధు 2019 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. 2017, 2018 ఎడిషన్లలో రజతం, 2013, 2014 టోర్నీల్లో కాంస్యం గెలిచింది. ఇప్పటికే లక్ష్యసేన్, హెచ్.ఎస్ ప్రణయ్ తాజాగా సింధు నిష్ర్కమించడంతో సింగిల్స్‌లో పతక ఆశలు గల్లంతయ్యాయి. మిక్స్‌డ్ డబుల్స్ జంట ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టోలు కూడా నిరాశపరిచారు. క్వార్టర్ ఫైనల్‌లో భారత జోడీ 15-21, 13-21 తేడాతో మలేసియాకు చెందిన చెన్ టాంగ్ జీ-టోహ్ ఈ వెయ్‌ జోడ చేతిలో ఓడిపోయింది. ఇక భారత్ పతక ఆశలు పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయి‌రాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టిలపైనే. క్వార్టర్ ఫైనల్‌లో వీరు.. మలేసియాకు చెందిన ఆరోన్ చియా,వూ యిక్ సోహ్‌లతో తలపడనుంది.

Next Story