IND vs SA 3rd ODI : తెలుగు కుర్రాడు నితీశ్‌కు చాన్స్?.. వారిద్దరిపై వేటు పడుతుందా?

by Harish |

భారత్, సౌతాఫ్రికా మధ్య వన్డే సిరీస్ రసవత్తరంగా మారింది.

IND vs SA 3rd ODI : తెలుగు కుర్రాడు నితీశ్‌కు చాన్స్?.. వారిద్దరిపై వేటు పడుతుందా?
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, సౌతాఫ్రికా మధ్య వన్డే సిరీస్ రసవత్తరంగా మారింది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా.. రెండో వన్డేలో సౌతాఫ్రికా గెలిచి సిరీస్ 1-1తో సమం చేసింది. రెండో వన్డేల్లో భారత్ 359 పరుగుల లక్ష్యం పెట్టినా సౌతాఫ్రికా ముందు చిన్నదే అయిపోయింది. ఇప్పుడు సిరీస్ ఫలితం వైజాగ్‌లో రేపు జరిగే ఆఖరిదైన మూడో వన్డేపై ఆధారపడింది. కాబట్టి, ఈ మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డై. ఇరు జట్ల ప్రదర్శనను చూస్తే ఈ మ్యాచ్‌ కూడా హోరాహోరీగా సాగడం ఖాయంగానే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే భారత జట్టు తమ లోపాలను సరిదిద్దుకునే పనిలో పడింది. మూడో వన్డేకు తమ తుది జట్టులో పలు మార్పులు చేసే అవకాశం ఉంది.

నితీశ్‌‌కు చోటు

గత రెండు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి మూడో వన్డేలో చోటు దక్కే అవకాశం ఉంది. బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకోలేదు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి 3 వికెట్లే తీశాడు. అంతకుమించి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతనిపై టీమ్ మేనేజ్‌మెంట్ వేటు వేసే అవకాశాలే ఎక్కువ. అతని స్థానాన్ని నితీశ్‌తో భర్తీ చేయొచ్చు. నితీశ్ రాకతో బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్ దళానికి బలం చేకూరినట్టు అవుతుంది. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు బాగానే రాణించినా బౌలర్ల వైఫల్యమే కనిపించింది. మరి, స్పెషలిస్ట్ పేసర్ ప్రసిద్ధ్‌ను కాకుండా పేస్ ఆల్‌రౌండర్ నితీశ్‌ను తీసుకుంటారా? అన్న ప్రశ్న కూడా ఉంది.

సుందర ఔట్.. పంత్ ఇన్

గాయం నుంచి కోలుకున్న తర్వాత రిషబ్ పంత్‌కు ఇదే తొలి వన్డే సిరీస్. అయితే, తొలి రెండు మ్యాచ్‌ల్లో అతనికి తుది జట్టులో చాన్స్ దక్కలేదు. రుతురాజ్ గైక్వాడ్‌ను తీసుకున్నారు. రెండో వన్డేలో గైక్వాడ్ శతకం బాదడంతో అతన్ని తప్పించడం కష్టమే. కానీ, టీమ్ మేనేజ్‌మెంట్ పంత్‌ను ఎలాగైనా తుది జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకోసం స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌‌పై వేటు వేయనున్నట్టు తెలుస్తోంది. సుందర్ రెండు వన్డేల్లోనూ నిరాశపరిచాడు. తొలి మ్యాచ్‌లో 13 రన్స్ చేయగా.. రెండో వన్డేల్లో ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో సుందర్‌ను తప్పించి తుది జట్టులోకి పంత్‌ను తీసుకోవాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచనగా తెలుస్తోంది. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో పంత్ రెండు మ్యాచ్‌ల్లోనూ నిరాశపరిచిన విషయం తెలిసిందే.


Next Story