- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చే నెలలో భారత్‌లో హాకీ వరల్డ్ కప్.. సంచలన నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్
భారత్‌లో జరగబోయే జూనియర్ హాకీ వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ తప్పుకుంది.

దిశ, స్పోర్ట్స్ : భారత్‌లో జరగబోయే జూనియర్ హాకీ వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ తప్పుకుంది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(ఎఫ్‌ఐహెచ్) శుక్రవారం ధ్రువీకరించింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్ మధ్య క్రీడా సంబంధాలు క్షీణించాయి. పురుషుల ఆసియా కప్‌లో, మహిళల వరల్డ్ కప్‌లో భారత ప్లేయర్లు పాక్ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ నిరాకరించిన విషయం తెలిసిందే. పాక్ హాకీ జట్టు ఇటీవల భారత్‌లోనే జరిగిన పురుషుల హాకీ ఆసియా కప్ నుంచి వైదొలిగింది.
నవంబర్ 28 నుంచి డిసెంబర్ 28 వరకు తమిళనాడులోని చెన్నయ్, మధురై వేదికలుగా జూనియర్ వరల్డ్ కప్ జరగనుంది. ఈ ఈవెంట్‌లో కూడా పాల్గొనడానికి పాక్ జట్టు రావడం లేదు. పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ ఈ విషయాన్ని ఎఫ్‌ఐహెచ్‌కు వెల్లడించింది. భారత్, చిలీ, స్విట్జర్లాండ్ జట్లతోపాటు పాక్ టీమ్ గ్రూపు బిలో ఉంది. పాక్ తప్పుకోవడంతో త్వరలోనే మరో టీమ్‌ను భర్తీ చేస్తామని ఎఫ్‌ఐహెచ్ తెలిపింది. తటస్థ వేదికపై అయితే పాక్ టోర్నీలో పాల్గొనాలని భావించింది. కానీ, ఎఫ్‌ఐహెచ్ నిరాకరించినట్టు తెలుస్తోంది.
పాక్ విత్ డ్రా గురించి తమకు సమాచారం లేదని హాకీ ఇండియా జనరల్ సెక్రెటరీ భోలాంత్ సింగ్ తెలిపారు. నెలన్నర క్రితం పాక్ హాకీ ఫెడరేషన్‌తో తాను మాట్లాడానని, వారు పాల్గొంటామని తెలిపారని చెప్పారు. ఏదేశమైనప్పటికీ భారత్‌లో టోర్నీని అత్యుత్తమంగా నిర్వహించడమే తమ లక్ష్యమని తెలిపారు.






