హ్యాండ్‌షేక్ వివాదం.. పాక్‌కు గట్టి షాక్ ఇచ్చిన ఐసీసీ

by Harish |

ఆసియా కప్‌లో పాకిస్తాన్ ప్లేయర్లకు భారత ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం వివాదంగా మారింది.

హ్యాండ్‌షేక్ వివాదం.. పాక్‌కు గట్టి షాక్ ఇచ్చిన ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో పాకిస్తాన్ ప్లేయర్లకు భారత ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం వివాదంగా మారింది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత క్రికెటర్లు కరచాలనం చేయలేదు. అయితే, టీమిండియా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నానా రాద్ధాంతం చేస్తోంది. ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. టాస్ సమయంలో సూర్యతో కరచాలనం చేయొద్దని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా‌కు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ చెప్పాడని, అతన్ని ఆసియా కప్ నుంచి తొలగించాలని ఫిర్యాదు చేసింది. అయితే, పాక్‌ను ఫిర్యాదును ఐసీసీ పట్టించుకోలేదు. పైక్రాఫ్ట్‌ను తొలగించాలన్న డిమాండ్‌ను తిరస్కరించింది. హ్యాండ్‌షేక్ వివాదంలో పైక్రాఫ్ట్ పాత్ర లేదని ఐసీసీ స్పష్టం చేసింది. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధికారులు ఇచ్చిన సమాచారాన్నే పైక్రాఫ్ట్..సల్మాన్ అఘాకు తెలియజేశాడని చెప్పింది.

వెనక్కి తగ్గిన పాక్

పైక్రాఫ్ట్‌ను తొలగించకపోతే బుధవారం యూఏఈతో జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని పీసీబీ బెదిరించింది. ఐసీసీ ఇచ్చిన షాక్‌తో పాక్‌కు వెనక్కి తగ్గడం తప్ప మరో మార్గం లేదు. బాయ్‌కాట్ చేస్తే పీసీబీకి భారీ నష్టం తప్పదని సంబంధిత వర్గాలే చెబుతున్నాయి. ‘ఆసియా కప్ నుంచి పాక్ వైదొలిగే చాన్స్ లేదు. జై షా నేతృత్వంలోని ఐసీసీ మాపై భారీ ఆంక్షలు విధిస్తుంది. అది మా బోర్డు భరించలేదు. మా అర్థిక పరిస్థితి అంతగా బాగా లేదు.’అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి.ఏసీసీ వార్షిక ఆదాయం నుంచి పాక్ 15 శాతం పొందుతుంది. ఆ మొత్తం దాదాపు రూ.140 కోట్లు. ఆసియా కప్ నుంచి తప్పుకంటే ఆ మొత్తాన్ని పాక్ కోల్పోనుంది. కాబట్టి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పీసీబీ రూ.140 కోట్లను కోల్పోవడానికి సిద్ధంగా లేదు.


Next Story