మళ్లీ నిరాశపర్చిన శ్రీకాంత్.. తొలి రౌండ్‌లోనే ఔట్

by Harish |

మళ్లీ నిరాశపర్చిన శ్రీకాంత్.. తొలి రౌండ్‌లోనే ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. కొంతకాలంగా ఈ తెలుగు కుర్రాడు తన స్థాయి ఆట ఆడలేకపోతున్నాడు. ఇదే నెలలో స్విస్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించిన అతను తాజాగా ఆర్లీన్స్ మాస్టర్స్ టోర్నీలోనూ మొదటి రౌండ్‌ను దాటలేకపోయాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన మాగ్సస్ జోహన్నెసెన్ చేతిలో 15-21, 21-12, 21-4 తేడాతో ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌లో మొదట శుభారంభం శ్రీకాంత్‌దే. తొలి గేము నెగ్గి ఆటను దూకుడుగా ఆరంభించాడు. కానీ, ఆ జోష్‌ను కొనసాగించలేకపోయాడు. మిగతా రెండు గేముల్లో ప్రత్యర్థిని నిలువరించలేక మ్యాచ్‌ను సమర్పించుకున్నాడు. మరోవైపు, యువ ప్లేయర్ ఆయుశ్ శెట్టి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్‌లో సహచరుడు కిరణ్ జార్జ్‌పై 21-17, 10-21, 17-21 తేడాతో విజయం సాధించాడు. యువ క్రీడాకారిణులు మాళవిక బాన్సోద్, తన్వి శర్మ, అన్మోల్ ఖర్బ్ కూడా శుభారంభం చేశారు. అన్మోల్ 21-12, 21-16 తేడాతో నెస్లిహన్ అరిన్(తుర్కియే)ను ఓడించగా.. మాళవిక 21-18, 21-14తో సంగ్ షువో యన్(చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. థాయిలాండ్ క్రీడాకారిణి సుపానిడా కటెథోంగ్‌తో తన్వి శర్మ తలపడగా..తొలి గేమును 21-18తో నెగ్గింది. కానీ, రెండో గేములో ప్రత్యర్థి ఆటలో మధ్యలో వైదొలగడంతో తన్వి ముందంజ వేసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత స్టార్ జోడీ తనీషా క్రాస్టో, ధ్రువ్ కపిల తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించారు. ఇండోనేషియాకు చెందిన ఫెర్డినాన్స్య-వర్దన జోడీ చేతిలో 21-14, 21-18 తేడాతో ఓడిపోయి ఇంటిదారిపట్టారు.


Next Story