Novak Djokovic : క్వార్టర్స్‌కు జకోవిచ్.. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అల్కరాజ్‌తో ‘ఢీ’

by Sathputhe Rajesh |

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్ విజయపరంపర కొనసాగుతోంది.

Novak Djokovic : క్వార్టర్స్‌కు జకోవిచ్.. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అల్కరాజ్‌తో ‘ఢీ’
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్ విజయపరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జకోవిచ్ 24వ సీడ్ జిరి లెహకాపై వరుస సెట్లలో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. రోడ్ లావెర్ అరెనా‌లో జరిగిన మ్యాచ్‌లో లెహకాపై 6-3, 6-4, 7-6 తేడాతో జకోవిచ్ గెలిచాడు. తద్వారా ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్స్‌కు 15 సార్లు చేరిన ఆటగాడిగా జకోవిచ్ నిలిచాడు. మంగళవారం కార్లోస్ అల్కరాజ్‌తో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జకోవిచ్ తలపడనున్నాడు. మ్యాచ్‌లో తొలి 90 నిమిషాల్లో జకోవిచ్ రెండు సెట్లు గెలుచుకున్నాడు. జకోవిచ్ ధాటికి లెహకా తొలి నుంచి మ్యాచ్‌లో వెనుకబడ్డాడు. మూడో సెట్‌లో మాత్రం జకోవిచ్ లెహకాపై శ్రమటోడ్చాల్సి వచ్చింది. టై బ్రేకర్‌కు వెళ్లిన ఈ సెట్‌లో జకోవిచ్ 7-6(4) తేడాతో గెలిచాడు. మూడో సెట్ 39 నిమిషాలు పాటు సాగింది. అలెగ్జాండర్ జ్వెరెవ్ సైతం ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఉగో హంబర్ట్‌పై 6-1, 2-6, 6-3, 6-2 తేడాతో జ్వరెవ్ విజయం సాధించాడు. జ్వరెవ్ క్వార్టర్స్‌లో టామీ పాల్‌తో తలపడనున్నాడు.

మిక్స్‌డ్ డబుల్స్‌లో బోపన్న జోడీ

భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న, చైనా క్రీడాకారిణి జంగ్ షూయ్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లారు. సెకండ్ రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ టేలర్ టౌన్‌సెండ్(యూఎస్ఏ), హుగో నిస్(మొనాకో)తో తలపడాల్సి ఉండగా వారు అనివార్య కారణాలతో మ్యాచ్ నుంచి నిష్క్రమించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒలివియా గడెస్కీ-జాన్ పీర్స్, టిమియా బబోస్(హంగేరీ)- మార్సెలో రెవాలో(ఈఐ సల్వేడార్స్‌) మధ్య జరిగే మ్యాచ్‌లో గెలుపొందిన జోడీతో తలపడనున్నారు. ఈ ఇండో-చైనీస్ జోడీ తమ తొలి మ్యాచ్‌లో క్రిస్టీనా మ్లెదొనొవిక్-ఇవాన్ డొడిక్‌లను 6-4, 6-4 తేడాతో ఓడించారు.

Next Story