- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Australian Open : జకోకు గాయం.. సెమీస్ మధ్యలోనే తప్పుకున్న దిగ్గజం.. ఫైనల్‌కు సిన్నర్, జ్వెరెవ్
ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ అనూహ్య రీతిలో నిష్ర్కమించాడు.

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ అనూహ్య రీతిలో నిష్ర్కమించాడు. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ దిశగా సాగిన అతని ప్రయాణం సెమీస్‌లోనే ముగిసింది. గాయం కారణంగా ఆట మధ్యలోనే అతను వైదొలిగాడు. అల్కరాజ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో జకో ఎడమ కాలుకు గాయమైంది. అయినప్పటికీ అతను సెమీస్ బరిలో నిలిచాడు. శుక్రవారం మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో జకో.. జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడ్డాడు. గాయంతో ఇబ్బంది పడుతునప్పటికీ జకో.. జ్వెరెవ్‌కు గట్టి పోటీనిచ్చాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన తొలి సెట్‌ను అతను 7-6(7-5)తో టై బ్రేకర్‌లో కోల్పోయాడు. తొలి సెట్ తర్వాత జకో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దీంతో జ్వెరెవ్ వాకోవర్ ద్వారా ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించడం జ్వెరెవ్‌కు ఇదే తొలిసారి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన రికార్డు జకో పేరిటే ఉంది. అయితే, అతను వచ్చే ఎడిషన్‌లో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. కొంతకాలంగా అతని రిటైర్మెంట్‌పై వార్తలు వస్తున్నాయి.
ఫైనల్‌లో సిన్నర్ అడుగు
వరల్డ్ నం.1 ప్లేయర్ జెన్నిక్ సిన్నర్(ఇటలీ) మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌పై కన్నేశాడు. టోర్నీలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఈ డిఫెండింగ్ చాంపియన్ వరుసగా రెండోసారి ఫైనల్‌లో అడుగుపెట్టాడు. సెమీస్‌లో అమెరికా ఆటగాడు బెన్ షెల్టన్‌ను 7-6(7-2), 6-2, 6-2 తేడాతో ఓడించాడు. ఆరంభ సెట్‌లో షెల్టన్ నుంచి సిన్నర్ తీవ్ర ప్రతి ఘటన ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని అతను చివరికి టై బ్రేకర్‌లో సెట్‌ను దక్కించుకున్నాడు. మిగతా రెండు సెట్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో షెల్టన్‌ను ఓడించడానికి సిన్నర్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. షెల్టన్ ఆరు డబుల్ ఫౌల్ట్స్, 55 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్‌లో సిన్నర్, జ్వెరెవ్ తాడోపేడో తేల్చుకోనున్నారు.






