వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వల్లే ఇదంతా.. మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా అసంతృప్తి

by Harish |

క్రికెట్‌లో ఒకప్పుడు అరివీర భయంకర జట్టుగా ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించిన వెస్టిండీస్ ఇప్పుడు పసికూనలా మారింది.

వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వల్లే ఇదంతా.. మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా అసంతృప్తి
X

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్‌లో ఒకప్పుడు అరివీర భయంకర జట్టుగా ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించిన వెస్టిండీస్ ఇప్పుడు పసికూనలా మారింది. ఆసిస్‌తో మూడో టెస్టులో 27 పరుగులకే కుప్పకూలిందంటే విండీస్ ప్రదర్శన ఏ విధంగా పతనమవుతుందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై విండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న లారా.. తప్పంతా విండీస్ క్రికెట్ బోర్డుదేనని అన్నాడు. నికోలస్ పూరన్ లాంటి ప్రతిభావంతులను దేశం కోసం ఆడేలా చేయడంలో బోర్డు విఫలమైందన్నాడు. ‘తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకునే ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. 29 ఏళ్లకే పూరన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను అలా ఎందుకు చేశాడో అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఐదు నుంచి ఆరు క్రికెట్ లీగ్‌లు ఉన్నాయి. అందులో ఆడటం ద్వారా ఆటగాళ్లు గణనీయమైన డబ్బును ఆర్జిస్తున్నారు. అందులో ఎలాంటి సమస్య లేదు. కానీ, నిజాయతీగా చెప్పాలంటే ఆటగాళ్లు దేశం కోసం ఆడేలా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఏం చర్యలు తీసుకోవడం లేదు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, భారత్ మెరుగైన విధానాలను అనుసరిస్తున్నాయి. కాబట్టి, మా ఆటగాళ్లు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. కేన్ విలియమన్స్, కొందరు సౌతాఫ్రికా ప్లేయర్లు కూడా తమ కుటుంబాల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు.’అని లారా చెప్పుకొచ్చాడు.


Next Story