కమిన్స్ ఇచ్చిన సలహా అదే.. ఇంగ్లండ్‌లో ఆడటంపై నితీశ్

by Phanindra |

ఇంగ్లండ్‌లో ఆడటంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తనకు ఇచ్చిన సలహాల గురించి నితీశ్ కుమార్ రెడ్డి వెల్లడించాడు.

కమిన్స్ ఇచ్చిన సలహా అదే.. ఇంగ్లండ్‌లో ఆడటంపై నితీశ్
X

దిశ, స్పోర్ట్స్: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆటలో భారత్‌కు బ్రేక్ ఇచ్చిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి.. తనకు వికెట్లు పడటానికి ఆసీస్ కెప్టెన్ ప్యాటి కమిన్స్ ఇచ్చిన సలహానే కారణమని చెప్పాడు. బుమ్రా, సిరాజ్‌, ఆకాశ్ దీప్‌కు వికెట్లు ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడిన ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ ఇద్దర్నీ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడీ తెలుగు కుర్రాడు. ఈ క్రమంలోనే తన బౌలింగ్ గురించి, ఇంగ్లండ్‌లో బౌలింగ్ చేసే విషయంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తనకిచ్చిన సలహాలు బాగా ఉపయోగపడ్డాయని చెప్పాడు.

ఐపీఎల్ ఆడే టైంలో కమిన్స్ మీకు ఏమైనా సలహాలిచ్చారా? అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అడిగిన ప్రశ్నకు నితీశ్ బదులిచ్చాడు. ‘ఆసీస్ టూర్ తర్వాత నా బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని నాకర్థమైంది. కన్సిస్టెన్సీ కోసం ట్రై చేస్తున్నా. ప్యాట్ నా కెప్టెన్. తనను అడిగితే ఆస్ట్రేలియాలో ఎలా బౌలింగ్ చేయాలో కొన్ని టిప్స్ ఇచ్చాడు. ఈ టూర్లో మా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో కలిసి చాలా శ్రమించా. తన మార్గదర్శకత్వంలో నా బౌలింగ్ మెరుగైంది’ అని చెప్పాడు.

అదే సమయంలో ఇంగ్లండ్‌లో ఆడే సమయంలో వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, ప్రాక్టీస్ గేమ్స్‌లోనే సాధ్యమైనంత నేర్చుకోవాలని కమిన్స్ సలహా ఇచ్చినట్లు చెప్పాడు. ‘ఆసీస్, ఇంగ్లండ్‌లో బౌలింగే చేయడంలో తేడా ఏంటని ప్యాట్‌ను అడిగా. అయితే పెద్దగా ఏం తేడా ఉండదని, కానీ వాతావరణాన్ని గమనించుకుంటూ ఉండాలని తను చెప్పాడు. నా నేచురల్ గేమ్ ఆడాలన్నాడు’ అని నితీశ్ గుర్తుచేసుకున్నాడు.

Next Story