దేశంపై నా చిత్తుశుద్ధిని ప్రశ్నించడం బాధగా ఉంది : నీరజ్ చోప్రా

by Harish |

ఈ ఏడాది మేలో బెంగళూరులో నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ జరగనుంది.

దేశంపై నా చిత్తుశుద్ధిని ప్రశ్నించడం బాధగా ఉంది : నీరజ్ చోప్రా
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది మేలో బెంగళూరులో నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ జరగనుంది. ఈ అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్‌లో పాల్గొనేందుకు స్టార్ అథ్టెట్లను నీరజ్ ఆహ్వానించాడు. పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌కు కూడా ఆహ్వానం పంపాడు. దీంతో నీరజ్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పహల్గాం ఘటన నేపథ్యంలో పాక్ అథ్లెట్ నదీమ్‌ను భారత్‌కు ఆహ్వానించడంపై అతనిపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలకు నీరజ్ స్పందించాడు. శుక్రవారం సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టాడు. దేశంపై తన చిత్తశుద్ధిని ప్రశ్నించడం చాలా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే, తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, తన కుటుంబాన్ని కూడా వదల్లేదని ఎమోషనల్ అయ్యాడు. ‘మన దేశంపై నా ప్రేమను, నా కుటుంబం పట్ల గౌరవాన్ని ప్రశ్నిస్తే నేను సైలెంట్‌గా ఉండను. అర్షద్‌ను అథ్లెట్‌గానే ఆహ్వానించా. అందులో మరే ఉద్దేశం లేదు. కానీ, చాలా మంది నాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నా కుటుంబాన్ని కూడా వారు వదిలిపెట్టలేదు. అత్యుత్తమ అథ్లెట్లను భారత్‌కు రప్పించడం, భారత్‌లో వరల్డ్ క్లాస్ స్పోర్టింగ్ ఈవెంట్లను నిర్వహించడమే నీరజ్ చోప్రా క్లాసిక్ లక్ష్యం. పహల్గాంలో ఉగ్రదాడికి ముందే అథ్లెట్లను ఆహ్వానించాం. 48 గంటల్లో చాలా జరిగాయి. నా దేశమే నాకు మొదటి ప్రాధాన్యత. పహల్గాం ఘటన నన్ను చాలా బాధపెట్టింది. కోపం కూడా తెప్పించింది. మన దేశం ప్రతిస్పందిస్తుందని, మన బలాన్ని చూపుతుందని కచ్చితంగా చెప్పగలను.’ అని తెలిపాడు.

ప్రశంసించిన వారే ఇప్పుడు టార్గెట్ చేశారు

‘దేశం గర్వపడేలా ఎన్నో ఏళ్లుగా కష్ణపడుతున్నా. నా చిత్తుశుద్ధిని ప్రశ్నించడం బాధగా ఉంది. సరైన కారణం లేకుండా నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు. కొన్ని మీడియాల్లోనూ తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. ప్రజలు తమ అభిప్రాయాలు ఎలా మార్చుకుంటున్నారో అర్థం చేసుకోవడం నాకు కష్టంగా ఉంది. సంవత్సరం క్రితం మా అమ్మ అమాయకత్వంగా మాట్లాడిన మాటలను ప్రశంసించారు. ఇప్పుడు అదే వ్యక్తులు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రపంచం భారత్‌ను గుర్తుంచుకునేలా కష్టపడుతూనే ఉంటా.’అని నీరజ్ చెప్పాడు.


Next Story