హాకీ వరల్డ్ క్వాలిఫయర్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్

by Harish |

హాకీ వరల్డ్ క్వాలిఫయర్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
X

దిశ, స్పోర్ట్స్ : ఎఫ్‌ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత మహిళల హాకీ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన తమ చివరి గ్రూపు మ్యాచ్‌లో వేల్స్‌పై 4-1తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కనీసం డ్రా చేసుకున్నా భారత్ సెమీస్‌లో అడుగుపెట్టేది. కానీ నవ్‌నీత్ కౌర్ ఏకంగా మూడు గోల్స్‌తో సత్తాచాటడంతో ఏకపక్ష విజయం సాధించింది. ఈ గేములో మొదటి నుంచి భారత్‌దే ఆధిపత్యం. 7వ నిమిషంలో సాక్షి జట్టుకు తొలి గోల్ అందించింది. ఆ తర్వాత నవ్‌నీత్ కౌర్ హ్యాట్రిక్ గోల్స్‌తో రెచ్చిపోయింది. వరుసగా 29, 34, 55 నిమిషాల్లో గోల్స్ చేసింది. దీంతో భారత్ ఏ దశలోనూ తడబడలేదు. ఇక వేల్స్ ఒకే గోల్‌కు పరిమితమైంది. థామస్ 39వ నిమిషంలో చేసిన గోలే తొలిది, ఆఖరిది. ఈ గెలుపుతో భారత్ పూల్-బిలో 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు గ్రూపు దశలో భారత జట్టు.. తొలి మ్యాచ్‌లో ఉరుగ్వేపై నెగ్గగా.. స్కాట్లాండ్‌తో డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. మరో మ్యాచ్‌లో ఉరుగ్వేపై 1-3తో స్కాట్లాండ్ విజయం సాధించింది. దీంతో పూల్-బి నుంచి ఆ టీమ్ రెండో స్థానంతో సెమీస్‌‌కు చేరుకుంది. శుక్రవారం జరిగే సెమీస్‌లో ఇటలీని భారత్ ఢీకొట్టనుంది.


Next Story