ముంబై ఇండియన్స్ అలవోక విజయం

by Ajay Maddhiboyina |

143 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.

ముంబై ఇండియన్స్ అలవోక విజయం
X

- యూపీ వారియర్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు

- పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి ముంబై

దిశ, స్పోర్ట్స్: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో భాగంగా బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన యూపీ వారియర్స్‌కు మొదటి ఓవర్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ కిరన్ నవ్‌గిరే (1) తక్కువ స్కోర్‌కే పెవీలియన్ చేరింది. ఆ తర్వాత మరో ఓపెనర్ గ్రేస్ హ్యారీస్, వ్రిందా దినేశ్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. వీరిద్దరూ కలసి రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. గ్రేస్ హ్యారీస్ (45) అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ దీప్తి శర్మ (4) నిరాశ పరిచింది. తాహిలా మెక్‌గ్రాత్ (1) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరింది. శ్వేతా షెరావత్ (19), ఉమా చెత్రీ (13) తర్వాత ఇక ఎవరూ డబుల్ డిజిట్ అందుకోలేక పోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో యూపీ వారియర్స్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు సాధించింది. నాట్ షివర్ బ్రంట్ మూడు వికెట్లు, షబ్నిం ఇస్మాయేల్, సంస్కృతి గుప్తా చెరి రెండు వికెట్లు, హార్లీ మాథ్యూస్, అమీలియా తలా ఒక వికెట్ తీశారు.

143 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యాషికా భాటియా (0) ఖాతా ఓపెన్ చేయకుండానే పెవీలియన్ చేరింది. ఆ తర్వాత మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్, నాట్ షివర్ బ్రంట్ కలిసి దూకుడుగా ఆడారు. యూపీ వారియర్స్ బౌలర్లను ధాటిగా ఆడుతూ బౌండరీలతో ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలసి రెండో వికెట్‌కు 133 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అయితే ఆఖర్లో ఓపెనర్ హేలీ మాథ్యూస్ (59) పెవీలియన్ చేరింది. అయితే నాట్ షివర్ బ్రంట్ (75), కెప్టెన్ హర్మన్ ప్రీత్ (4) మరో వికెట్ పడకుండా 17 ఓవర్లలోనే ముంబై ఇండియన్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. నాట్ షివర్ బ్రంట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

స్కోర్ బోర్డు :

యూపీ వారియర్స్ (డబ్ల్యూ) : 142 ఆలౌట్ (20 ఓవర్లు) (గ్రేస్ హ్యారీస్ 45, వ్రిందా దినేశ్ 33), నాట్ షివర్ బ్రంట్ 3 వికెట్లు

ముంబై ఇండియన్స్ (డబ్ల్యూ): 143/2 (17 ఓవర్లు) (నాట్ షివర్ బ్రంట్ 75 నాటౌట్, హేలీ మాథ్యూస్ 59)

Next Story