ధోనీ తనకు నచ్చిన వాళ్లకే సపోర్ట్ చేశాడు.. నేను బాగా ఆడినా చాన్స్ ఇవ్వలేదు : మనోజ్ తివారీ

by Harish |

భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ధోనీ తనకు నచ్చిన వాళ్లకే సపోర్ట్ చేశాడు.. నేను బాగా ఆడినా చాన్స్ ఇవ్వలేదు : మనోజ్ తివారీ
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తివారీ.. ధోనీ కెప్టెన్సీ‌లో తనకు రావాల్సిన అవకాశాలు దక్కలేదన్నాడు. ధోనీకి తాను నచ్చలేదని, అందుకే తనకు మద్దతు ఇవ్వలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రతి ఒక్కరూ ధోనీని ఇష్టపడతారు. ధోనీ నాయకత్వ లక్షణాలు బాగుంటాయని ఎప్పటికీ చెబుతాను. కానీ, నా విషయంలో మరోలా జరిగింది. అతను నన్ను ఇష్టపడలేదు. ఆ సమయంలో ధోనీ తనకు ఇష్టమైన ఇద్దరికి బాగా సపోర్ట్ చేశాడు. చాలా మందికి ఇది తెలుసు. కానీ, ఎవరూ ముందుకు వచ్చి చెప్పరు. నాకు ఎందుకు మద్దతు ఇవ్వలేదో ఇప్పటివరకు నాకు సమాధానం తెలియదు. ధోనీ, డంకెన్ ఫ్లెచర్, సెలెక్టర్లు దీనికి సమాధానం చెబుతారని అనుకుంటున్నా. సెంచరీ చేసినా తర్వాత కూడా నాకు అవకాశాలు ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటని ధోనీని కలిసినప్పుడు కచ్చితంగా అడుగుతా.’అని తివారీ చెప్పుకొచ్చాడు.

అలాగే, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను తేల్చడానికి బీసీసీఐ యోయో టెస్టుతోపాటు కొత్తగా బ్రాంకో టెస్టును ప్రవేశపెట్టడంపై కూడా తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ను వన్డే జట్టు నుంచి తప్పించడానికి ఈ టెస్టును తీసుకొచ్చారని ఆరోపించాడు. ‘2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి కోహ్లీని తప్పించడం కష్టం. కానీ, రోహిత్‌ను తప్పించాలని చూస్తున్నారు. భారత క్రికెట్‌లో ఏం జరుగుతుందో నిశితంగా పరిశీలిస్తున్నా. అందుకే నాకు సందేహం కలుగుతుంది. రోహిత్ లాంటి ప్లేయర్లు జట్టులో భాగం కాకూడదనే ఈ బ్రోంకో టెస్టును ప్రవేశపెట్టారని నమ్ముతున్నా.’ అని తివారీ తెలిపాడు. బ్రాంకో టెస్టు చాలా కఠినమైన ఫిట్‌నెస్ టెస్టు అని, రోహిత్ ఫిట్‌నెస్‌పై కష్టపడకపోతే దాన్ని పాస్ అవ్వడం కష్టమేనని చెప్పాడు.


Next Story