- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుమ్రా లేనప్పుడే బౌలింగ్ ఎందుకు బాగా చేస్తానంటే.. సీక్రెట్ బయటపెట్టిన సిరాజ్
ఇటీవల ఇంగ్లాండ్ గడ్డపై భారత స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ సంచలన ప్రదర్శన చేశాడు.

దిశ, స్పోర్ట్స్: ఇటీవల ఇంగ్లాండ్ గడ్డపై భారత స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ సంచలన ప్రదర్శన చేశాడు. ఏకంగా 23 వికెట్లు తీసి సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ముఖ్యంగా బుమ్రా గైర్హాజరు అయిన రెండు, ఐదు టెస్టుల్లో భారత గెలవడంలో అతనిదే కీలక పాత్ర. ఆ మ్యాచ్‌ల్లో సిరాజ్ బౌలింగ్‌ను ఎంత పొగిడినా తక్కువే. బుమ్రా ఉన్నప్పుడు కంటే లేనప్పుడే సిరాజ్ బౌలింగ్ ప్రదర్శన మెరుగ్గా ఉంటుందని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంటుంది. దీనిపై తాజాగా స్వయంగా సిరాజే స్పందించాడు. ‘బాధ్యతను మోసే అవకాశం వచ్చినప్పుడు సాధారణ సిరీస్‌లోనూ నా ప్రదర్శన పెరుగుతుంది. బాధ్యత నాకు భిన్నమైన సంతోషాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.’అని చెప్పాడు. ఇంగ్లాండ్‌లో బుమ్రా గైర్హాజరులో భారత్‌పై విమర్శలు చేసిన వారి నోరు మూయించానని తెలిపాడు.‘ఎడ్జ్‌బస్టన్‌లో నా గురించి మాట్లాడుకున్నారు. నేను ఏం చేయగలనో నాకు తెలుసు. వారికి తెలియదు. వారు అతిగా మాట్లాడారు. అందుకు వారి నోళ్లు మూయించడానికి అదే సరైన సమయని భావించా. బుమ్రా వెన్ను గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అప్పుడు బౌలింగ్ దళంలో సానుకూల వాతావరణాన్ని కొనసాగించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. మనం దీన్ని సాధించగలమనే నమ్మకాన్ని నా సహచర ఆటగాళ్లలో కలిగించడానికి చూస్తా. మనం ఇప్పటికే సాధించిన వాటిని మళ్లీ చేసి చూపించవచ్చని చెబుతా.’అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
నా దూకుడుకు కారణం కోహ్లీనే
మైదానంలో తన దూకుడుకు కారణం విరాట్ కోహ్లీనే అని సిరాజ్ తెలిపాడు. ‘ఆర్సీబీలో కోహ్లీ తో కలిసి ఉన్నాను. అతనితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆటలో పోరాట పటిమను కోహ్లీని చూసే నేర్చుకున్నా. మైదానంలో ప్రత్యర్థులను శత్రువుల్లా.. బయట స్నేహితుల్లా చూడాలనే అతని తీరు నాకు నచ్చింది. నేను దూకుడుగా లేకపోతే బౌలింగ్ బాగా చేయలేను. ఫాస్ట్ బౌలర్లు మైదానంలో దూకుడుగా ఉంటారు. కానీ, వారి కంటే కోహ్లీ దూకుడు ఎక్కువ.’అని సిరాజ్ తెలిపాడు.






