టెర్రరిస్ట్‌లకు కూడా అలాంటి పరిస్థితి రాలేదేమో.. సచ్చిపోవాలనుకున్నా : మహ్మద్ షమీ

by Harish |

టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ క్రికెటర్‌గా అత్యున్నత స్థాయిని చూశాడు

టెర్రరిస్ట్‌లకు కూడా అలాంటి పరిస్థితి రాలేదేమో.. సచ్చిపోవాలనుకున్నా : మహ్మద్ షమీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ క్రికెటర్‌గా అత్యున్నత స్థాయిని చూశాడు. కానీ, అతని వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ చర్చనీయాంశమే. 2018లో అతని భార్య హసిన్ జహాన్‌ పెట్టిన గృహహింస కేసు అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అతని కెరీర్‌పై ప్రభావం చూపడటంతోపాటు తీవ్రంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఓ సమయంలో షమీ ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడట. కానీ, క్రికెట్‌పై ప్రేమే అతన్ని ఆ ఆలోచన నుంచి బయటపడేసిందట. ఈ విషయాన్ని షమీనే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షమీ తన వ్యక్తిగత జీవితం, వివాహంపై ఓపెన్‌గా మాట్లాడాడు. ‘సూసైడ్ ఆలోచన వచ్చింది. కానీ, నేను చేసుకోలేదు. వరల్డ్ కప్ మిస్ అయ్యే వాడిని. నా జీవితాన్ని ముగించాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు క్రికెట్ నాకు ఎంతో పేరు తీసుకొచ్చింది. నేనెందుకు దూకాలి అనుకున్నా. అంతా మర్చిపోయి గేముపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నా.’అని తెలిపాడు.

జీవితం చాలా విషయాలు నేర్పుతుందని, జీవితంలో తాను చేసిన పెద్ద తప్పు పెళ్లేనని చెప్పాడు. అది తన కర్మ అంటూ కామెంట్స్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం ఈజీ కాదన్నాడు. ‘ఒక పక్క ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలి. మరో పక్క దేశం తరపున బాగా ఆడాలి. మనపై చాలా ఒత్తిడిని పెంచుతుంది.’అని తెలిపాడు. సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారా? అని అడగ్గా.. తాను ట్రై చేసినట్టు షమీ చెప్పాడు. ‘ఇంట్లో ఎవరూ గొడవలు కోరుకోరు. ముఖ్యంగా దేశానికి సేవ చేస్తున్నప్పుడు. అవతలి వాళ్లు కూడా అదే అనుకోవాలి. లేదంటే సహనం తప్ప మరో ఆన్సర్ ఉండదు.’అని చెప్పుకొచ్చాడు. గృహహింస ఆరోపణల తర్వాత తాను సోషల్ మీడియాలో తాను దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నానని చెప్పాడు. ‘నేనెప్పుడూ చూడని ప్రాంతాల్లోనే నా ఫొటోలు చూసేవాడిని. గత 6-7 ఏళ్లుగా నాపై చాలా ఆరోపణలు వచ్చాయి. బహుశా ఉగ్రవాదిపై కూడా ఇన్ని వచ్చి ఉండవేమో.’అని ఎమోషనల్ అయ్యాడు.


Next Story