Hockey Asia Cup : జపాన్‌ను చిత్తు చేసిన భారత్.. తర్వాతి రౌండ్‌కు క్వాలిఫై

by Harish |

హాకీ ఆసియా కప్‌లో భారత పురుషుల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది.

Hockey Asia Cup : జపాన్‌ను చిత్తు చేసిన భారత్.. తర్వాతి రౌండ్‌కు క్వాలిఫై
X

దిశ, స్పోర్ట్స్ : బిహార్‌లోని రాజ్‌గిరి వేదికగా జరుగుతున్న హాకీ ఆసియా కప్‌లో భారత పురుషుల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ తర్వాతి రౌండ్ అయిన సూపర్ 4ఎస్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన రెండో గ్రూపు మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో జపాన్‌పై విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్‌‌ప్రీత్ మరోసారి సత్తాచాటాడు. కీలకమైన రెండు గోల్స్ చేసి జట్టును గెలిపించాడు. భారత్ మ్యాచ్‌‌‌ను దూకుడుగా మొదలుపెట్టింది. మొదటి ఐదు నిమిషాల్లోనే రెండు గోల్స్ చేసింది. మన్‌దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ బ్యాక్ టూ బ్యాక్ గోల్స్ చేశారు. దీంతో భారత్ ఆరంభంలోనే 2-0తో పట్టు బిగించింది.

అనంతరం జపాన్ డిఫెన్స్‌ను కట్టుదిట్టం చేసింది. అదే సమయంలో కోసీ కవాబే జపాన్‌ను ఆదుకున్నాడు. 38వ నిమిషంలో గోల్ చేసి జట్టును పోటీలోకి తెచ్చాడు. అయితే, మ్యాచ్ ముగియడానికి మరో 14 నిమిషాలు ఉందనగా హర్మన్‌ప్రీత్ మరో గోల్ చేశాడు. దీంతో భారత్ 3-1తో ఆధిక్యంలో నిలిచి విజయానికి చేరువైంది. అలాగే, జపాన్‌ను కట్టడి చేసింది. అయితే, 59వ నిమిషంలో కోసీ కవాబే మరో గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 3-2కి తగ్గించినా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. సోమవారం చివరి గ్రూపు మ్యాచ్‌లో కజకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. తర్వాతి రౌండ్ బెర్త్ ఖరారు కావడంతో ఈ మ్యాచ్ నామమాత్రమే. మరోవైపు, మరో బెర్త్ కోసం చైనా, జపాన్ పోటీపడుతున్నాయి. సోమవారం ఈ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ముందడుగు వేస్తుంది.


Next Story