సన్‌రైజర్స్ మళ్లీ గాడిన పడుతుందా?

by Ajay Maddhiboyina |

ఇటీవల కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అనుకున్నంత మేర రాణించడం లేదు.

సన్‌రైజర్స్ మళ్లీ గాడిన పడుతుందా?
X

- వరుసగా రెండో ఓటములతో 8వ స్థానంలో ఎస్‌ఆర్‌హెచ్

- బ్యాటింగ్‌లో విఫలమవుతున్న టాపార్డర్

- బౌలింగ్ అంతంత మాత్రమే

- కేకేఆర్‌కూ విషమ పరీక్షే

- నేడు ఈడెన్ గార్డెన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ Vs కేకేఆర్

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2025 సీజన్‌ను ఘనంగా ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా హైదరాబాద్ జట్టు గాడిన పడకుంటే మున్ముందు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి. అందుకే గురువారం ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2024లో ఐపీఎల్ ఫైనలిస్టులు అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ఈ సీజన్‌లో రెండు ఓటములను ఎదుర్కున్నాయి. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ తప్ప మిగిలిన రెండు మ్యాచ్‌లు ఓడిపోయాయి. కాస్త మెరుగైన రన్ రేట్ ఉన్న సన్‌రైజర్స్ జట్టు 8వ స్థానంలో ఉండగా.. కేకేఆర్ టీమ్ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున ఉంది.

వీళ్లు రాణిస్తేనే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లైనప్ చూస్తే ప్రత్యర్థి జట్లకు చెమటలు పడతాయి. లీగ్‌లో అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్‌ కలిగి ఉన్న జట్టుగా సన్‌రైజర్స్‌కు పేరుంది. ఓపెనర్లలో ట్రావీస్ హెడ్ కాస్త పర్వాలేదనిపించేలా ఆడుతున్నాడు. కానీ మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ఫామ్ లేమితో తడబడుతున్నాడు. వీరిద్దరూ సమిష్టిగా రాణిస్తేనే పవర్ ప్లేలో భారీ స్కోర్లు నమోదవుతాయి. ఇక సన్‌రైజర్స్ తరపున ఈ సీజన్‌లో అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ మొదటి మ్యాచ్‌లో సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లు పూర్తిగా విఫలం అయ్యాడు. అతను కూడా తిరిగి ఫామ్‌ను అందుకోవల్సి ఉంది. మరోవైపు నితీశ్ కుమార్ రెడ్డి ఆశించిన మేర రాణించడం లేదు. అతను కూడా గాడిన పడి, క్లాసెన్ నుంచి 40+ స్కోర్లు వస్తే సన్‌రైజర్స్‌ను ఆపడం కష్టమే. ఇక లోయర్ ఆర్డర్‌లో అంకిత్ వర్మ తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్నాడు. అయితే అభినవ్ మనోహర్ విఫలమవుతుండటం ఆందోళనకరం. సన్‌రైజర్స్ బౌలింగ్ అత్యంత పేలవంగా ఉంది. జీషన్ అన్సారీ తప్ప మిగిలిన బౌలర్లు పెద్దగా రాణించడం లేదు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, మహ్మద్ షమి, హర్షల్ పటేల్‌లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తేనే ప్రత్యర్థి జట్టును కట్టడి చేసే అవకావం ఉంటుంది.

కేకేఆర్ పరిస్థితి అంతే..

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కూడా పేపర్‌పై బలంగా కనిపిస్తున్నా.. ఫీల్డ్‌లో దిగిన తర్వాత చేతులెత్తేస్తున్నారు. ఓపెనర్లు డికాక్, సునిల్ నరైన్‌లు ఎప్పుడు రాణిస్తారో అర్థం కావడం లేదు. వారి బ్యాటింగ్‌లో నిలకడ లేమి కేకేఆర్‌కు మైనస్‌గా మారింది. రహానే పర్వాలేదనిపిస్తున్నా.. వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ ఫామ్‌లో లేకపోవడం ఆందోలన కలిగిస్తుంది. లోయర్ ఆర్డర్‌లో రమణ దీక్షితులు, రస్సెల్ ఆర్నాల్డ్‌లు విఫలమవుతుండటంతో జట్టు భారీ స్కోర్లు సాధించలేకపోతుంది. బౌలింగ్‌లో హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్‌లు రాణిస్తే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవు. ఇటీవల కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అనుకున్నంత మేర రాణించడం లేదు. మరి ఈ మ్యాచ్‌లో ఏ మేరకు అద్భుతాలు చేస్తాడో చూడాలి.

స్టాట్స్:

- ఐపీఎల్‌లో రెండు జట్లు ఇప్పటి వరకు 28 మ్యాచ్‌లలో తలపడగా.. కేకేఆర్ 19, సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌లలో విజయం సాధించాయి.

- ఈడెన్ గార్డెన్‌లో ఈ రెండు జట్లు 7 సార్లు తలపడగా.. కేకేఆర్ 4, ఎస్ఆర్‌హెచ్ 3 మ్యాచ్‌లలో గెలిచాయి.

- ఈడెన్ గార్డెన్‌లో పిచ్ ప్రస్తుతం బ్యాటర్లకు, మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది.

- 2022 నుంచి మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోర్ 194

- 2022 నుంచి ఇక్కడ టార్గెట్ చేసిన సగటు స్కోర్ 187

- ఇక్కడ మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు 8 సార్లు, ఛేజ్ చేసిన జట్టు 9 సార్లు విజయం సాధించాయి.

Next Story