Malaysia Open : సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు.. సాత్విక్ జోడీకి నిరాశ

by Harish |

Malaysia Open : సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు.. సాత్విక్ జోడీకి నిరాశ
X

దిశ, స్పోర్ట్స్ : మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సెమీస్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్‌ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు ప్రత్యర్థి ప్రస్తుత వరల్డ్ చాంపియన్ అయిన యమగూచి(జపాన్)‌తో తలపడింది. ఆరంభం నుంచే సింధు దూకుడుగా ఆడింది. తొలి గేమును 21-11తో సొంతం చేసుకుంది. కేవలం 12 నిమిషాల్లోనే ఆ గేము గెలవడం విశేషం. ఆ తర్వాత యమగూచి మోకాలి గాయంతో ఇబ్బందిపడింది. ఇక ఆట‌లో కొనసాగలేనని నిర్ణయించుకున్న యమగూచి మ్యాచ్ నుంచి తప్పుకుంది. దీంతో సింధు నేరుగా సెమీస్‌కు చేరుకుంది. మలేసియా ఓపెన్ టోర్నీలో సింధు 8ఏళ్ల తర్వాత సెమీస్‌కు చేరుకుంది. ఇంతకుముందు 2018లో టాప్–4లో నిలిచింది. శనివారం జరిగే సెమీస్‌లో సింధు.. వరల్డ్ నం.2 వాంగ్ జి యి(చైనా)ను ఎదుర్కోనుంది.

సాత్విక్ జోడీ నిష్ర్కమణ

టోర్నీలో పురుషుల విభాగంలో భారత్ పతక ఆశలు ఆవిరయ్యాయి. భారీ అంచనాలు ఉన్న సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్స్‌ను దాటలేకపోయింది. ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియాన్-ముహ్మమద్ షోహిబుల్ ఫిక్రి జంట చేతిలో 21-10, 23-21 తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. ఆరంభంలో తడబడిన భారత ప్లేయర్లు తొలి గేము‌లో ప్రత్యర్థులకు పోటీ ఇవ్వలేకపోయారు. అయితే, రెండో గేములో తీవ్రంగానే పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇక, టోర్నీలో మిగిలిన సింధుపైనే భారత్ ఆశలు పెట్టుకుంది.


Next Story