అదరగొడుతున్న తెలుగు కుర్రాడు తరుణ్.. మకావు ఓపెన్ టోర్నీలో ఏకంగా టాప్ సీడ్‌కే షాక్

by Harish |

మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్, తెలుగు కుర్రాడు మన్నెపల్లి తరుణ్ సత్తాచాటుతున్నాడు.

అదరగొడుతున్న తెలుగు కుర్రాడు తరుణ్.. మకావు ఓపెన్ టోర్నీలో ఏకంగా టాప్ సీడ్‌కే షాక్
X

దిశ, స్పోర్ట్స్ : మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్, తెలుగు కుర్రాడు మన్నెపల్లి తరుణ్ సత్తాచాటుతున్నాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో సంచలన ప్రదర్శన చేస్తున్న అతను వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశాడు. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో తరుణ్ ఏకంగా టాప్ సీడ్ ప్లేయర్‌కే షాకివ్వడం విశేషం. అంతేకాకుండా, క్వార్టర్ ఫైనల్స్‌లో కూడా అడుగుపెట్టాడు. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 47వ ర్యాంక్‌లో ఉన్న తరుణ్ రెండో రౌండ్‌లో 19-21, 21-14, 22-20 తేడాతో 15వ ర్యాంకర్ లీ చెయిక్ యియు(హాంకాంగ్)‌ను మట్టికరిపించాడు. తన కంటే మెరుగైన ర్యాంక్ కలిగిన ప్లేయర్‌పై తరుణ్ అద్భుతమైన పోరాటం చేశాడు. తొలి గేము నుంచే గట్టిపోటీనిచ్చాడు. అయితే, తరుణ్‌కు శుభారంభం దక్కలేదు. తొలి గేము కోల్పోయాడు. కానీ, ఆ తర్వాత అతను బలంగా పుంజుకున్నాడు. ప్రత్యర్థి దూకుడును నిలువరించాడు. రెండో గేమును ఏకపక్షంగా నెగ్గి పోటీలోకి వచ్చాడు. ఇక, నిర్ణయాత్మక మూడో గేములో కూడా తరుణ్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైనా వెనుకడుగు వేయలేదు. చివరికి మూడో గేము నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.

లక్ష్యసేన్, సాత్విక్ జోడీ కూడా..

భారత స్టార్ సింగిల్స్ ప్లేయర్ లక్ష్యసేన్ కూడా ముందంజ వేశాడు. రెండో రౌండ్‌లో ఇండోనేషియా ప్లేయర్ చికో ఔరా ద్వి వార్డోయో‌ను ఓడించాడు. గంటకుపైగా సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-14, 14-21, 21-17తో విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మరో యువ షట్లర్ ఆయుశ్ శెట్టి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. జస్టిన్ హోహ్ చేతిలో 21-18, 21-16 తేడాతో ఓడి రెండో రౌండ్‌లో ఇంటిదారిపట్టాడు. ఇక, పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి కూడా క్వార్టర్స్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో సాత్విక్ జోడీ 10-21, 22-10, 21-16 తేడాతో జపాన్‌కు చెందిన కుమగై-నిషి జంటపై గెలుపొందింది. తొలి గేములో పెద్దగా ఆకట్టుకోని భారత ద్వయం ఆ తర్వాత పుంజుకుని విజయం సాధించింది.


Next Story