స్పిన్ పిచ్ అడిగిన గంభీర్.. స్పోర్టింగ్ పిచ్ తయారుచేశానన్న క్యురేటర్

by Phanindra |

కోల్‌కతాలో సౌతాఫ్రికాతో తొలి టెస్టు కోసం స్పిన్ పిచ్ తయారు చేయాలని గంభీర్ అడిగాడు. అయితే తను మాత్రం స్పోర్టింగ్ పిచ్ తయారుచేశానని క్యురేటర్ చెప్పాడు.

స్పిన్ పిచ్ అడిగిన గంభీర్.. స్పోర్టింగ్ పిచ్ తయారుచేశానన్న క్యురేటర్
X

దిశ, స్పోర్ట్స్: సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు కోల్‌కతా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పిచ్ నుంచి అందరికీ సహకారం ఉండేలా తయారు చేసినట్లు క్యూరేటర్ సుజన్ ముఖర్జీ చెప్పాడు. గౌతం గంభీర్ నేతృత్వంలోని టీమిండియా మేనేజ్‌మెంట్ కొంత టర్న్ ఉండే పిచ్‌లు తయారు చేయాలని కోరినట్లు ఆయన తెలిపాడు. శుక్రవారం నాడు మొదలయ్యే తొలి టెస్టు కోసం టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టింది. గతేడాది స్వదేశంలో న్యూజిల్యాండ్‌తో ఆడిన మూడు టెస్టుల్లో ఓడి, వైట్ వాష్‌కు గురైన టీమిండియాకు.. ఆ తర్వాత స్వదేశంలో ఎదురవనున్న అతిపెద్ద సవాల్‌ సౌతాఫ్రికా సిరీసే అని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఎలాగైనా ఈ సిరీస్ గెలవాలని భారత్ పట్టుదలగా ఉంది. అందుకే కొంచెం టర్న్ ఉండేలా పిచ్ తయారు చేయాలని గంభీర్ అండ్ కో అడిగినట్లు తెలుస్తోంది. జడేజా, కుల్దీప్ యాదవ్ జట్టులో ఉండటంతో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌ కావాలని అడిగింది. అయితే తాను అలాంటి పిచ్ తయారు చేయలేదని సుజన్ ముఖర్జీ అన్నాడు.

స్పిన్ పిచ్ తయారు చేశారా?

‘ఇది మంచి పిచ్‌. చక్కని స్పోర్టింగ్ పిచ్ తయారు చేశా. రోజులు గడిచే కొద్దీ బౌలర్లకు టర్న్ లభిస్తుంది. బౌన్స్ కూడా ఉంటుంది. బ్యాటర్లు, బౌలర్లు.. అందరికీ ఈ పిచ్ నుంచి సహకారం ఉంటుంది’ అని సుజన్ చెప్పుకొచ్చాడు. ఇక హోంటీంతో చర్చలు ఎప్పుడూ ఉండేవే అని వివరించాడు. ఆస్ట్రేలియా వెళ్తే అక్కడ బౌన్స్ పిచ్‌లు అడుగుతారని, భారత జట్లు కొంచెం టర్న్ ఉండే పిచ్‌లు అడుగుతారని ముఖర్జీ వివరించాడు. స్పిన్ పిచ్‌లు తయారు చేస్తే టీమిండియాకు కష్టాలు తప్పవా? అని అడిగితే.. ‘అది నేను చెప్పలేను కదా. ఆడే వాళ్లు చెప్పాల్సిందే. మా పని మంచి పిచ్ రెడీ చేయడం అంతే. ప్రేక్షకులు మ్యాచ్ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా అంతే’ అని వివరించాడు.

Next Story