ఆసియా చాంపియన్‌గా తెలుగమ్మాయి.. ఆర్చరీలో మరోసారి సత్తాచాటిన జ్యోతి

by Harish |

భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నెం జ్యోతి సురేఖ అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది.

ఆసియా చాంపియన్‌గా తెలుగమ్మాయి.. ఆర్చరీలో మరోసారి సత్తాచాటిన జ్యోతి
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నెం జ్యోతి సురేఖ అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. మరోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆమె కాంపౌండ్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకుంది. గురువారం జరిగిన వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్‌లో జ్యోతి 147-145తో మరో భారత ఆర్చర్ ప్రతీక ప్రదీప్‌పై విజయం సాధించింది. ఇద్దరూ పోటాపోటీగా బాణాలు సంధించారు. మూడు సెట్లు డ్రా అయ్యాయంటే ఇద్దరి మధ్య పోటీ ఏ మేరకు ఆసక్తికరంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. తొలి, నాలుగు సెట్లలో ప్రతీక కంటే జ్యోతి ఒక్క పాయింట్ అదనంగా సాధించడంతో చివరికి రెండు పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో జ్యోతి రెండవసారి వ్యక్తిగత విభాగంలో ఆసియా చాంపియన్‌గా నిలిచింది. ఇంతకుముందు 2021లో తొలిసారిగా టైటిల్ గెలిచింది. ప్రతీక రజత పతకంతో సరిపెట్టింది.

ఇక, టీమ్ ఈవెంట్‌లో జ్యోతి, ప్రతీక, దీప్షిక త్రయం ఫైనల్‌లో 236-234 తేడాతో కొరియాను ఓడించి విజేతగా నిలిచింది. మొత్తంగా ఆసియా చాంపియన్‌షిప్‌లో(వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లు కలిపి) జ్యోతికి 7వ గోల్డ్ మెడల్ కైవసం చేసుకోవడం విశేషం. ఇక, కౌంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కూడా భారత్‌కు బంగారు పతకం దక్కింది. ఫైనల్‌లో అభిషేక్ వర్మ, దీప్షిక జంట 153-151 తేడాతో బంగ్లాదేశ్‌కు చెందిన బొన్న అక్టెర్–హిము బచ్చర్ జోడీపై విజయం సాధించింది. కాంపౌండ్ పురుషుల జట్టు మాత్రం రజతంతో సరిపెట్టింది. అభిషేక్, సాహిల్ రాజేశ్, ప్రథమేశ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్‌లో 230-229 తేడాతో ఓడిపోయి తృటిలో స్వర్ణాన్ని కోల్పోయింది. మొత్తంగా గురువారం ఒక్క రోజే భారత ఆర్చర్లు ఐదు పతకాలు సాధించగా అందులో మూడు గోల్డ్ మెడల్స్ ఉండటం విశేషం.


Next Story