చరిత్ర సృష్టించిన పాలినీ.. 40 ఏళ్ల రికార్డు బద్దలు

by Phanindra |   (  Updated:2025-05-17 17:16:41  IST  )

ఇటలీ టెన్నిస్ స్టార్ జాస్మిన్ పాలినీ చరిత్ర సృష్టించింది. 40 ఏళ్ల తర్వాత ఇటాలియన్ ఓపెన్ గెలిచిన ఇటలీ భామగా నిలిచింది.

చరిత్ర సృష్టించిన పాలినీ.. 40 ఏళ్ల రికార్డు బద్దలు
X

దిశ, స్పోర్ట్స్: ఇటలీ టెన్నిస్ ప్లేయర్ జాస్మిన్ పాలినీ చరిత్ర సృష్టించింది. 40 ఏళ్ల తర్వాత ఇటాలియన్ ఓపెన్ నెగ్గిన ఇటలీ భామగా నిలిచింది. చివరగా 1985లో ఇటలీకి చెందిన రఫెలా రెజ్జీ.. ఇటాలియన్ ఓపెన్ నెగ్గింది. ఆ తర్వాత ఎప్పుడూ లోకల్ భామలు ఈ టోర్నీ గెలవలేదు. పురుషుల్లో కూడా 1976 తర్వాత ఇటలీ వాళ్లెవరూ ఇటాలియన్ ఓపెన్ నెగ్గలేదు. ఇంతకాలం తర్వాత జాస్మిన్ పాలినీ ఈ రికార్డు తిరగరాసింది. శనివారం జరిగిన ఇటాలియన్ ఓపెన్ ఫైనల్‌లో యూఎస్‌కు చెందిన కోకో గాఫ్‌ను జాస్మిన్ చిత్తుగా ఓడించింది. ప్రపంచ ఐదో ర్యాంక్ జాస్మిన్ 6-4, 6-2 తేడాతో వరుస గేమ్స్‌లో గాఫ్‌ను మట్టికరిపించి ట్రోఫీ ముద్దాడింది.

ఆదివారం జరిగే మహిళల డబుల్స్ ఫైనల్‌లో సారా ఎర్రానీతో కలిసి పాలినీ ఆడుతోంది. బెల్జియంకు చెందిన ఎలీస్ మార్టెన్స్, రష్యన్ వెరోనికా కుదెర్మెతోవా జంటను ఎదుర్కొనబోతోంది. కాగా, ఫ్రెంచ్ ఓపెన్ 2024, వింబుల్డన్‌ 2025లో కూడా పాలినీ అద్భుతంగా పోరాడి ఫైనల్ చేరినా.. చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గతేడాది జరిగిన బిల్లీ జీన్ కప్‌ నెగ్గిన ఆమె.. సోమవారం నాడు వెలువడే తాజా ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నాలుగో స్థానానికి చేరుతుంది.

Next Story