- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా జట్టులో ఎంత కీలక సభ్యుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు ఫార్మాట్లలో ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల బీసీసీఐ ప్లేయర్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో బుమ్రాకు ‘ఏ’ కేటగిరీ దక్కింది. అయితే, బుమ్రా సెంట్రల్ కాంట్రాక్ట్‌పై బీసీసీఐ పునరాలోచన చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో బుమ్రా ‘ఏ +’ కేటగిరీలో ఉన్నాడు. ఈ సారి ఆ కేటగిరీని బోర్డు తొలగించడంతో ‘ఏ’లోకి వచ్చాడు. ‘ఏ +’లో ఉన్నప్పుడు బుమ్రాకు వార్షిక వేతనంగా రూ.7 కోట్లు అందగా.. ఈ సారి రూ.5 కోట్లు మాత్రమే బోర్డు చెల్లించనుంది. దీంతో బుమ్రా రూ.2 కోట్లు కోల్పోతున్నాడు.
ప్రస్తుతం ‘ఏ’ కేటగిరీలో బుమ్రాతోపాటు గిల్, జడేజా కూడా ఉన్నారు. జడేజా కూడా ‘ఏ +’ నుంచి ఇప్పుడు ‘ఏ’కు వచ్చాడు. కానీ, అతను టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే, టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. ఇక గిల్ గతంలో ‘ఏ’లోనే ఉన్నాడు. బుమ్రా అన్ని ఫార్మాట్లు ఆడుతున్నప్పటికీ రూ.2 కోట్లు నష్టపోతుండటంతో బోర్డు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. వార్షిక వేతనం రూ.5 కోట్లతోపాటు అదనంగా రూ.2 కోట్లు పరిహారం అతనికి ఇవ్వాలని బోర్డు ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, టీ20 జట్టు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ విషయంలో కూడా బోర్డు ఇదే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అతను గ్రేడ్ సిలో ఉన్నాడు. వార్షిక వేతనంగా రూ. కోటి మాత్రమే అందుకోనున్నాడు. దీంతో అతని కాంట్రాక్ట్ మొత్తాన్ని పెంచాలని బీసీసీఐ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గ్రేడ్ ‘ఏ’ నుంచి గ్రేడ్ ‘బి’కి డీమోట్ అయిన కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ కాంట్రాక్ట్‌లపై పునరాలోచన చేయనున్నట్టు సమాచారం. దీనిపై బీసీసీఐ అధికారికంగా స్పందిస్తేనే స్పష్టత వస్తుంది.






