- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జట్టును గెలిపించాను.. అయినా పక్కనపెట్టాడు.. ధోనీపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ తనను జట్టు నుంచి తప్పించాడని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే మరో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ధోనీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను బాగా ఆడినప్పటికీ ధోనీ తనను పక్కనపెట్టాడని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పఠాన్ పలు విషయాలు వెల్లడించాడు. ‘శ్రీలంకతో మ్యాచ్‌లో నేను, నా అన్న యూసఫ్ పఠాన్ కలిసి అద్భుతమైన విజయాన్ని అందించాం. 27-28 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో మేము జట్టును గెలిపించాం. ఆ పరిస్థితుల్లో మరెవరైనా ఉంటే జట్టులో ఏడాది పాటు ఉండేవాడు. కానీ, తర్వాతి సిరీస్‌కే నన్ను పక్కనపెట్టారు. న్యూజిలాండ్‌లో మూడు మ్యాచ్‌లకే బెంచ్‌కే పరిమితమయ్యా. నాలుగో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఐదో మ్యాచ్‌లో కూడా లేను.’అని ఇర్ఫాన్ తెలిపాడు.
అయితే, తనను పక్కనపెట్టడం వెనుక అప్పటి కెప్టెన్ ధోనీ హస్తం ఉందని అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ను కలిశాక అర్థమైందన్నాడు. ‘నన్ను పక్కనపెట్టడానికి కారణం ఏంటి?.. ఏ విషయంలోనైనా మెరుగుపడలా? అని కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ను అడిగా. అప్పుడు కిర్‌స్టెన్ రెండు కారణాలు చెప్పాడు. కొన్ని విషయాలు నా చేతుల్లో లేవన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది. తుది జట్టు కెప్టెన్ ఎంపికపై నిర్ణయిస్తారు. కెప్టెన్, కోచ్, మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు ధోనీ కెప్టెన్. అతను తీసుకున్న నిర్ణయం తప్పా? సరైందా? అనేది నాకు తెలియదు. ప్రతి కెప్టెన్‌కు తనదైన స్టైల్‌లో జట్టును నడిపించే హక్కు ఉంటుంది. రెండో కారణం నం.7లో వారు బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలనుకున్నారు. నా బ్రదర్ యూసఫ్ పఠాన్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. నేను బౌలింగ్ ఆల్‌రౌండర్. జట్టులో ఒక్కరికే స్థానం ఉంది. ప్రస్తుతం ఇద్దరు ఆల్‌రౌండర్లను తీసుకుంటున్నారు.’అని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. 2009 జాతీయ జట్టులో చోటు కోల్పోయిన ఇర్ఫాన్ 2012లో తిరిగి వచ్చినా ఎంతోకాలం కొనసాగలేకపోయాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.






