- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ మళ్లీ రానే వచ్చింది. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది. నేటి నుంచే 19వ సీజన్ ప్రారంభం. శనివారం బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఓపెనింగ్ మ్యాచ్‌తో ఐపీఎల్ సంబురం మొదలుకానుంది. దాదాపు రెండు నెలలపాటు లీగ్ అభిమానులను అలరించనుంది. నేటి నుంచి మే 24 వరకు లీగ్ దశలో 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 31న ఫైనల్ జరగనుంది.ప్లే ఆఫ్స్‌కు సంబంధించిన తేదీలు, వేదికలు ఖరారవ్వాల్సి ఉంది. గతేడాది టైటిల్ నిరీక్షణకు తెరదించిన డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సారి కూడా టైటిల్ నిలబెట్టుకోవాలన్న ఆశతో ఉంది. ఇక, చెన్నయ్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ‘సిక్సర్’ కొట్టాలని భావిస్తున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ 4వ టైటిల్‌పై కన్నేయగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ రెండో కప్పు కోసం ఎదురుచూస్తున్నాయి. ఇక పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తొలి టైటిల్ నిరీక్షణకు తెరదించాలని బరిలోకి దిగుతున్నాయి. మరి, ఈ సీజన్ చాంపియన్ ఎవరో మే 31న తేలనుంది.
ఫార్మాట్ ఇలా..
2022 నుంచి అమలు చేస్తున్న ఫార్మాటే ఈ సీజన్‌లోనూ కొనసాగనుంది. మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో 70 మ్యాచ్‌లు ఉంటాయి. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఏలో సీఎస్కే, కేకేఆర్, ఆర్ఆర్, ఆర్సీబీ, పీబీకేఎస్.. గ్రూపు-బిలో ఎంఐ, ఎస్‌ఆర్‌హెచ్, జీటీ, డీసీ, ఎల్‌ఎస్‌జీ జట్లు ఉన్నాయి. లీగ్ స్టేజ్‌లో ఒక్కో టీమ్ 14 మ్యాచ్‌లు ఆడతుంది. ఒక జట్టు తమ గ్రూపులోని మరో 4 జట్లతో, అలాగే మరో గ్రూపులో తమ స్థానంలో ఉన్న జట్టుతో రెండేసి గేములు, ఇతర మూడు జట్లతో చెరో గేము ఆడుతుంది. లీగ్ స్టేజ్‌లో టాప్-4 జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. తొలి, రెండు స్థానాల్లో నిలిచిన టీమ్‌లు క్వాలిఫయర్-1 ఆడతాయి. అక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. 3,4 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో పాల్గొంటాయి. అక్కడ నెగ్గిన జట్టు, క్వాలిఫయర్-1లో ఓడిన టీమ్ రెండో ఫైనల్ బెర్త్ కోసం పోటీపడతాయి. ఇక ఫైనల్‌లో క్వాలిఫయర్ 1 విజేత, క్వాలిఫయర్ 2 విన్నర్ టైటిల్ కోసం తాడోపేడో తేల్చుకుంటాయి.
ప్రారంభ వేడుకలు రద్దు
సాధారణంగా ప్రతి సీజన్‌లో ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు ప్రారంభ వేడుకలను బీసీసీఐ నిర్వహిస్తూ వస్తోంది. అయితే, ఈ సారి ప్రారంభ వేడుకలు లేకుండా ఐపీఎల్ మొదలుకానుంది. ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. గతేడాది ఆర్సీబీ విజయోత్సవాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మరణించగా 50కిపైగా గాయపడ్డారు. వారి కుటుంబాల పట్ల సానుభూతి, గౌరవంతో ప్రత్యేక వేడుకలకు బోర్డు ఈ సారి దూరంగా ఉంది. అయితే, ముగింపు వేడుకలను మాత్రం ఘనంగా నిర్వహిస్తామని సెక్రెటరీ దేవజిత్ సైకియా తెలిపారు.
10 జట్ల కెప్టెన్లు మనోళ్లే
ఈ సీజన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. 10 జట్లకు భారత ఆటగాళ్లే కెప్టెన్లుగా ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అన్ని జట్లకు భారత సారథులే ఉండటం ఇదే తొలిసారి. ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా, చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు రుతురాజ్ గైక్వాడ్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు అక్షర్ పటేల్, పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అజింక్యా రహానె, లక్నో సూపర్ జెయింట్స్‌కు రిషబ్ పంత్, గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పటిదార్, రాజస్థాన్ రాయల్స్‌కు రియాన్ పరాగ్ సారథులుగా ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా పలు మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడు. దీంతో ఇషాన్ కిషన్‌ను ఎస్‌ఆర్‌హెచ్ తాత్కాలిక కెప్టెన్‌గా నియమించడంతో ఈ సీజన్‌లో అన్ని జట్లకు భారత కెప్టెన్లే ఉండబోతున్నారు.
300..చూస్తామా?
గత రెండు సీజన్లుగా మైదానాల్లో పరుగుల వరద పారుతోంది. ఆ జట్టు ఈ జట్టు అని తేడా లేకుండా అన్ని జట్ల బ్యాటర్లు బౌలర్లను ఊచకోతకోశారు. 200 స్కోరు చాలా సాధారణమైపోయింది. 250 కూడా గత రెండు సీజన్లలో చాలా మ్యాచ్‌ల్లో నమోదైంది. 2013లో ఆర్సీబీ తొలిసారి 250 మార్క్‌ను టచ్ చేసింది. పుణె వారియర్స్‌పై 263 స్కోరు చేసింది. ఆ తర్వాత 2023 వరకు ఒక్కసారి మాత్రమే 250 స్కోరు వచ్చింది. కానీ, గత రెండేళ్లలో 10 సార్లు 250కిపైగా స్కోర్లు నమోదయ్యాయి. 2024లో ఎస్‌ఆర్‌హెచ్..ఆర్సీబీపై 287 పరుగులు చేసింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో హయ్యెస్ట్ స్కోరు అదే. దీంతో అందరూ 300 స్కోరు ఎప్పుడా? అని ఎదురుచూస్తున్నారు. ఆ జట్టు ఏ మార్క్‌ను అందుకుంటుందోనని ఆసక్తిగా ఉన్నారు. సన్‌రైజర్స్ పేరిటే టాప్-4 హయ్యెస్ట్ స్కోర్లు(287, 286, 278, 277) ఉన్నాయి. హైదరాబాద్ టీమే 300 స్కోరు మార్క్‌ను అందుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ జట్టు బ్యాటింగ్ పవర్ అలా ఉంది మరి. ఇతర జట్లను కూడా నమ్మలేం. టీ20ల్లో ఏదైనా జరగొచ్చు.
ధోనీ చివరిసారిగా?
సీఎస్కే దిగ్గజం ఎం.ఎస్ ధోనీకి ఇదే ఆఖరి సీజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత 2-3 సీజన్లు ఇవే వార్తలు వచ్చినా ధోనీ మాత్రం కంటిన్యూ అవుతూ వచ్చాడు. కానీ, ఈ సారి మాత్రం కచ్చితంగా వీడ్కోలు పలుకుతాడని బలంగా ప్రచారం సాగుతోంది. సీఎస్కే మాజీ క్రికెటర్లు కూడా ఇదే చెబుతున్నారు. ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ కూడా రిటైర్మెంట్ ఇస్తాడని అంటున్నారు. అతను స్టేడియంలోకి దిగితే చాలు ఫ్యాన్స్ ఖుషి అవుతారు. ఒక్క బౌండరీ కొడితే చాలు స్టేడియం హోరెత్తిపోతుంది. జట్లతో సంబంధం లేకుండా ధోనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి అభిమానులు మాహీ ఆటను చివరిసారిగా చూసేందుకు స్టేడియాలకు పోటెత్తే అవకాశాలు ఉన్నాయి. సీఎస్కేలోకి సంజూ శాంసన్ రాకతో ఈ సారి ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే చాన్స్ ఉంది.
- Tags
- IPL 2026






