Ravichandran Ashwin : సీఎస్కేను వీడనున్న అశ్విన్?..

by Harish |   (  Updated:2025-08-08 14:59:59  IST  )

స్పిన్నర్ ఆర్. అశ్విన్ చెన్నయ్ సూపర్ కింగ్స్‌ను వీడనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Ravichandran Ashwin : సీఎస్కేను వీడనున్న అశ్విన్?..
X

దిశ, స్పోర్ట్స్ : పదేళ్ల తర్వాత ఈ సీజన్‌లో తిరిగి చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే) గూటికి చేరిన స్పినర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రయాణం ఆ జట్టుతో ఒక్క సీజన్‌కే పరిమితయ్యేలా కనిపిస్తుంది. సీఎస్కేను అతను వీడనున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. తనను రిలీజ్ చేయాలని అశ్విన్ మేనేజ్‌మెంట్‌ను కోరినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అశ్విన్ గానీ, సీఎస్కే‌గానీ ఆ వార్తలను ఇంకా ధ్రువీకరించలేదు.అలాగే, కొట్టిపారేయనూ లేదు. అయితే, సీఎస్కే క్యాంప్‌లో తాజా పరిణామాలు చూస్తుంటే సీఎస్కే‌ను అశ్విన్ వీడనున్నాడనే ప్రచారం సాగుతుంది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ తాజాగా తన ఐపీఎల్ ఫ్యూచర్‌పై సీఎస్కే మేనేజ్‌మెంట్‌తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఎం.ఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్ సహా సీఎస్కే ఉన్నత అధికారులు, టాప్ ప్లేయర్లు గత కొన్ని రోజులుగా చెన్నయ్‌లో సమావేశం అవుతున్నట్టు ఓ ప్రముఖ జాతీయ మీడియా పేర్కొంది. వచ్చే సీజన్ ప్రణాళికల గురించి చర్చించినట్టు తెలిపింది.

తనను రిలీజ్ చేయాలని అశ్విన్ రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అతను వేరే ఫ్రాంచైజీకి వెళ్లాలని చూస్తున్నట్టు కూడా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఆటగాళ్లతో మాట్లాడం ప్రీ ఆక్షన్‌ ప్లాన్ భాగమని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. అశ్విన్‌‌తో కూడా అలాగే చర్చించి ఉండొచ్చని పేర్కొన్నాయి. ప్లేయర్ల ఫ్యూచర్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఇది ప్రారంభ దశ అని, రిటెన్షన్‌‌కు ఇంకా సమయం ఉందని తెలిపాయి. అశ్విన్ గానీ, సీఎస్కే మేనేజ్‌మెంట్‌గానీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.2009-2015 వరకు చెన్నయ్‌కు ఆడిన అశ్విన్ ఆ తర్వాత ఇతర జట్లకు ఆడాడు. 10 ఏళ్ల తర్వాత తిరిగి సీఎస్కే‌లో చేరాడు. ఈ సీజన్‌కు ముందు మెగా వేలంలో చెన్నయ్ ఫ్రాంచైజీ 9.75 కోట్లకు అతన్ని తీసుకుంది. అయితే, ఈ సీజన్‌లో అశ్విన్ నిలకడగా రాణించలేదు. 9 మ్యాచ్‌ల్లో కేవలం 7 వికెట్లే తీశాడు. దీంతో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడంతో పలు మ్యాచ్‌లకు అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు.

Next Story