చరిత్ర సృష్టించిన భవానీ దేవి

by Javid Pasha |

భారత స్టార్ ఫెన్సర్ భవానీ దేవి చరిత్ర సృష్టించింది. ఏషియన్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం దక్కించుకుంది.

చరిత్ర సృష్టించిన భవానీ దేవి
X

వక్‌సి : భారత స్టార్ ఫెన్సర్ భవానీ దేవి చరిత్ర సృష్టించింది. ఏషియన్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం దక్కించుకుంది. దాంతో ఏషియన్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారత ఫెన్సర్‌గా ఘనత సాధించింది. ఉమెన్స్ వ్యక్తిగత సబ్రె ఈవెంట్‌లో సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భవానీ దేవి 15-10 తేడాతో వరల్డ్ చాంపియన్ మిసాకి ఎమురాను(జపాన్)ను చిత్తు చేచేసింది. దాంతో సెమీస్‌లో అడుగుపెట్టడంతో ఆమెకు పతకం ఖాయమైంది. అంతకుముందు తొలి రౌండ్‌లో బై పొందిన భవానీ దేవి.. రెండో రౌండ్‌లో కజకస్తాన్‌కు చెందిన దోస్పే కరీనాను 15-13 తేడాతో ఓడించింది. ఆ తర్వాత ప్రీక్వార్టర్స్‌లో 3వ సీడ్, ఒజాకి సెరీని(జపాన్)‌పై 15-11 తేడాతో గెలిచి క్వార్టర్స్‌కు చేరుకుంది.

అక్కడ వరల్డ్ చాంపియన్‌ మిసాకి ఎమురాను ఓడించి పతకం ఖాయం చేసుకుంది. అయితే, సెమీస్‌లో భవానీ పోరాడి ఓడింది. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జైనబ్ దయిబెకోవా చేతిలో 15-14 తేడాతో పరాజయం పాలైంది. దాంతో భవానీ కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఏషియన్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకం గెలవడం ఇదే తొలిసారి. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా భవానీ దేవి ఇప్పటికే ఘనత సాధించిన విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె రౌండ్-32లో నిష్ర్కమించింది.

Next Story