- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అద్భుతం చేసిన భారత మాజీ క్రికెటర్లు.. కానీ, సెమీస్‌లో పాక్‌తో ఢీ.. మ్యాచ్ జరుగుతుందా?
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఇండియా చాంపియన్స్ అద్భుతం చేసింది.

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఇండియా చాంపియన్స్ అద్భుతం చేసింది. ఆఖరి మ్యాచ్‌లో వెస్టిండీస్ చాంపియన్స్ చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో సెమీస్‌కు చేరుకుంటుందన్న ఆశలు లేవు. కానీ, ఆఖరి మ్యాచ్‌లో ఇండియా సంచలనం సృష్టించింది. మంగళవారం అర్థరాత్రి జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ చాంపియన్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన ఆఖరి మ్యాచ్‌లో ఇండియా చాంపియన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను నిర్ణీత 20 ఓవర్లలో మోస్తరు స్కోరు 144/9కే పరిమితం చేసింది. పొలార్డ్(74 నాటౌట్) ఒంటరి పోరాటంతో ఆ జట్టు ఆ స్కోరైనా చేసింది. మిగతా వారిలో ముగ్గురు డకౌటవ్వగా.. మరో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో పీయూశ్ చావ్లా 3 వికెట్లు, వరుణ్ ఆరోన్, స్టువర్ట్ బిన్నీ చెరో 2 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. 145 పరుగుల లక్ష్యాన్ని ఇండియా చాంపియన్స్ 13.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్టువర్ట్ బిన్నీ(50 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీ బాది కీలక పాత్ర పోషించాడు. శిఖర్ ధావన్(25), యువరాజ్ సింగ్(21), యూసఫ్ పఠాన్(21 నాటౌట్) కూడా విలువైన పరుగులు జోడించారు. ఈ గెలుపుతో భారత్(3 పాయింట్స్) పాయింట్స్ టేబుల్‌లో 4వ స్థానానికి చేరుకుని సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇంగ్లాండ్ చాంపియన్స్ కూడా 3 పాయింట్లతోనే ఉన్నప్పటికీ భారత్ మెరుగైన రన్‌రేట్‌తో ముందడుగు వేసింది.
పాక్‌తో మ్యాచ్ రద్దు?
సెమీస్‌లో పాకిస్తాన్ చాంపియన్స్‌తో భారత్ చాంపియన్స్ తలపడాల్సి ఉంది. గురువారం జరగాల్సిన ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువ. పాక్‌తో ఆడేందుకు భారత మాజీ క్రికెటర్లు సిద్ధంగా లేరు. గ్రూపు దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. సెమీస్‌లో కూడా ఆడేందుకు భారత్ నిరాకరించినట్టు తెలుస్తోంది. ‘ఇంతకుముందు ఆడలేదు. ఇప్పుడు కూడా ఆడను’అని ధావన్ మాట్లాడిన ఓ వీడియో వైరల్‌గా మారింది. సెమీస్ రద్దైతే పాక్‌కే లాభం. గ్రూపు దశలో అగ్రస్థానంలో నిలవడం వల్ల పాకే ఫైనల్‌కు చేరుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.






