Ind vs SL : టెన్షన్ పెట్టిన నిసాంక.. సూపర్‌ ఓవర్‌లో టీమిండియా విజయం

by Harish |

ఆసియా కప్‌లో ఏకపక్ష విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియా శ్రీలంకపై మాత్రం అతికష్టం మీద గెలిచింది.

Ind vs SL : టెన్షన్ పెట్టిన నిసాంక.. సూపర్‌ ఓవర్‌లో టీమిండియా విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో ఏకపక్ష విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియా.. శ్రీలంకపై మాత్రం అతికష్టం మీద గెలిచింది. దుబాయ్ వేదికగా శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన చివరి సూపర్-4 మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 202/5 స్కోరు చేసింది. అభిషేక్(61), తిలక్(49 నాటౌట్), శాంసన్(39), అక్షర్(2 నాటౌట్) రాణించడంతో టీ20 ఆసియా కప్ చరిత్రలో భారత్ రెండో అత్యధిక స్కోరు చేసింది. అయితే, భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఛేదనకు దిగిన శ్రీలంక జట్టులో నిసాంక(107) మెరుపు శతకంతో రెచ్చిపోయాడు. అతనికితోడు పెరీరా(58) సత్తాచాటాడు. ఇక, చివర్లో షనక(22 నాటౌట్) విలువైన రన్స్ జోడించడంతో శ్రీలంక కూడా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లగా అక్కడ భారత్ పెద్దగా కష్టపడకుండానే గెలిచింది.

నిసాంక దెబ్బేశాడు

203 పరుగుల భారీ టార్గెట్ శ్రీలంక ముందు పెట్టడంతో భారత్‌కు మరో భారీ విజయం ఖాయమే అనిపించింది. ఆ దిశగానే పాండ్యా తొలి ఓవర్‌లోనే కుసాల్ మెండిస్(0)ను కూడా అవుట్ చేశాడు. కానీ, ఓపెనర్ నిసాంక మాత్రం మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. శతకంతో రెచ్చిపోయిన అతను భారత్‌ను టెన్షన్ పెట్టాడు. అతనికి కుసాల్ పెరీరా కూడా తోడయ్యాడు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో శ్రీలంక స్కోరు పరుగులు పెట్టింది. వీరిద్దరిని ముఖ్యంగా నిసాంకను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. చాలా సేపటి తర్వాత కుసాల్ పెరీరా(58)‌ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేసి ఊరటనిచ్చాడు. అసలంక(5), కమిందు మెండిస్(3) కూడా స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. కానీ, నిసాంక పట్టు వదిలితే కదా. చివరి ఓవర్‌లో 12 రన్స్ కావాల్సి ఉండగా నిసాంక జోరు చూస్తుంటే శ్రీలంకను గెలిపించేలా కనిపించాడు. కానీ, హర్షిత్ రాణా తొలి బంతికి అతన్ని అవుట్ చేశాడు. ఇక, ఐదు బంతుల్లో షనక(22 నాటౌట్) 11 పరుగులు రాబట్టి స్కోరును సమం చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు మళ్లించాడు.

చెలరేగిన అభిషేక్

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(4) రెండో ఓవర్‌లోనే అవుటయ్యాడు. కానీ, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన భీకర ఫామ్‌ను కొనసాగించాడు. గత మ్యాచ్‌ల్లాగే విజృంభించి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఏ బౌలర్‌ను వదలకుండా ఎడాపెడా బౌండరీలు దంచాడు. ఈ క్రమంలోనే వరుసగా మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 31 బంతుల్లో 61 రన్స్ చేసి అవుటయ్యాడు. అంతకుముందు కెప్టెన్ సూర్యకుమార్(12) మరోసారి నిరాశపరిచాడు. మళ్లీ తక్కువ స్కోరుకే అవుటయ్యారు. ఇక, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(49 నాటౌట్) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శాంసన్(39) కూడా రాణించాడు. శాంసన్, తిలక్ కలిసి స్కోరును 150 దాటించాడు. ఆ తర్వాత శాంసన్, పాండ్యా(2) స్వల్ప వ్యవధిలోనే అవుటవ్వగా.. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్(21 నాటౌట్) విలువైన పరుగులు జోడించాడు. దీంతో స్కోరు 200 దాటింది.

సూపర్ ఓవర్ ఇలా..

సూపర్ ఓవర్‌లో ముందుగా శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా అర్ష్‌దీప్ బౌలింగ్ వేశాడు. తొలి బంతికే పెరీరాను అవుట్ చేశాడు. రెండో బంతికి మెండిస్ ఒక్క పరుగు తీయగా.. మూడో బంతికి పరుగు రాలేదు. నాలుగో బంతి వైడ్ వేయగా ఎక్స్‌ట్రా రన్ వచ్చింది. అదనపు బంతికి పరుగు రాలేదు. ఐదో బంతికి అర్ష్‌దీప్.. షనకను అవుట్ చేశాడు. దీంతో శ్రీలంక మొత్తం 2 పరుగులు చేయగా.. బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య మొదటి బంతికే 3 రన్స్ తీయడంతో భారత్ విజయం లాంఛనమైంది.

Next Story