- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND VS ENG : హెడింగ్లీలో హిట్ కొడతారా?.. భారత్, ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచే తొలి టెస్టు
ఇంగ్లాండ్‌తో ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సమరానికి టీమిండియా సిద్ధమైంది.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సమరానికి టీమిండియా సిద్ధమైంది. సుదీర్ఘ ఐదు టెస్టుల సిరీస్ నేటి నుంచే ప్రారంభం. లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా శుక్రవారం నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2025-27 సర్కిల్‌ను భారత్ ఈ సిరీస్‌తోనే ప్రారంభించనుంది. అలాగే, రోహిత్ తర్వాత భారత టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన శుభ్‌మన్ గిల్‌కు సారథిగా ఇదే తొలి టెస్టు. దీంతో ఈ టూరు గిల్‌కు పరీక్షే. తొలి విదేశీ పర్యటనలో అతను కెప్టెన్ ఏ మేరకు ఆకట్టుకుంటాడనేది ఆసక్తికరం. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్, విరాట్ కోహ్లీ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వారి లేని లోటు టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బేతీసేదే . గిల్ నేతృత్వంలోని కుర్రాళ్లతో కూడిన యువ జట్టు కొత్త శకానికి నాంది పలకనుంది. పంత్, రాహుల్, గిల్, జైశ్వాల్, జడేజా, బుమ్రాలతో ఈ జట్టు కూడా బలంగానే కనిపిస్తున్నది. ఐదు టెస్టుల సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని భారత్ భావిస్తోంది. మరోవైపు, ఇంగ్లాండ్ జట్టును సొంతగడ్డపై ఓడించడం అంత సులభం కాదు. ప్రత్యర్థి నుంచి సవాల్ తప్పదు. బలాబలాల పరంగా ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తుండటంతో తొలి టెస్టు రసవత్తరంగా సాగే అవకాశాలే ఉన్నాయి.
బ్యాటుతో ఏం చేస్తారో?
ఇంగ్లాండ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. బంతి పేస్‌తోపాటు స్వింగ్ అవుతూ బ్యాటర్లను పరీక్షిస్తోంది. కాబట్టి, బ్యాటింగ్‌కు భారత బ్యాటర్లకు అంత సులభంగా ఉండదని తెలిసిందే. దీనికితోడు భారత బ్యాటింగ్ దళంలో అనుభవలేమి కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పుడు లేరు. కొంతకాలంగా వారు టెస్టుల్లో ఫామ్ బాగా లేకపోయినా జట్టులో వారు ఉన్నారనే ధైర్యం ఉండేది. ఇప్పుడు అది లేదు. గిల్, పంత్, రాహుల్, జైశ్వాల్, సాయి సుదర్శన్ ఇలా అందరూ కుర్రాళ్లే. అయితే, ఇంగ్లాండ్ గడ్డపై పంత్, రాహుల్‌కు మంచి రికార్డే ఉంది. పంత్ 9 మ్యాచ్‌ల్లో 556 రన్స్ చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉండటం విశేషం. అలాగే, రాహుల్ కూడా 9 మ్యాచ్‌ల్లో 614 పరుగులు చేశాడు. అతని ఖాతాలోనూ రెండు శతకాలు ఉన్నాయి. కోహ్లీ, రోహిత్ లేని వేళ వీరిద్దరూ ఇప్పుడు భారత జట్టులో కీలకం కానున్నారు. మరోవైపు, గిల్‌కు మాత్రం పేలవ రికార్డే ఉంది. ఇంగ్లాండ్‌లో ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన అతను కేవలం 88 పరుగులే చేశాడు. కీలకమైన 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తుండటంతో గిల్ ఈ సారి చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉంది. టెస్టుల్లో మంచి ప్రదర్శన చేస్తున్న జైశ్వాల్ ఇంగ్లాండ్‌లో తొలి టెస్టు ఆడబోతున్నాడు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్‌లకు కూడా ఇంగ్లాండ్‌లో ఆడటం మొదటిసారే. నిలకడగా రాణిస్తుండటం, ఇద్దరికీ కౌంటీ చాంపియన్‌షిప్ ఆడిన అనుభవం ఉండటం సానుకూలంశం. ఇక, సీనియర్ ఆల్‌రౌండర్ జడేజాకు ఇంగ్లాండ్‌లో 12 టెస్టులు ఆడాడు. బ్యాటుతో తన వంతు పాత్ర పోషించాల్సి ఉంది.
బుమ్రా ఉన్నాడుగా..
భారత జట్టులో జస్ప్రిత్ బుమ్రా పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుమ్రా అంటే దీమా. బుమ్రా అంటే ధైర్యం. అతను ఉన్నాడంటే జట్టును గెలిపిస్తాడులే అని అభిమానులు భావిస్తుంటారు. ఇప్పుడు ఇంగ్లాండ్ టూరులో బుమ్రా కీలకంగా మారనున్నాడు. రోహిత్, కోహ్లీ, అశ్విన్ లాంటి దిగ్గజాలు లేని వేళ అతనిపై మరింత బాధ్యత ఉంటుంది. ఇంగ్లాండ్‌పై అతనికి తిరుగులేని రికార్డు ఉంది. 2018-24 మధ్య 14 టెస్టులు ఆడిన అతను ఏకంగా 60 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌లో 9 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు తీశాడు. అందులో రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం. బుమ్రా అంటేనే ప్రత్యర్థి జట్లు హడెలెత్తిపోతాయి. ఇంగ్లాండ్ కూడా అందుకు మినహాయింపు ఏం కాదని అతని గణాంకాలే చెబుతున్నాయి. బుమ్రాకు తాము భయపడమని ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు. ఇలా ఇంగ్లిష్ జట్టు పైకి మేక పోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా బుమ్రా ఎంతటి ప్రమాదమో ఆ జట్టుకు బాగా తెలుసు.
తుది జట్టులో ఎవరెవరు?
తొలి టెస్టులో బరిలోకి దిగే భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తుది జట్టు ఎంపిక కెప్టెన్ గిల్‌కు సవాల్‌గానే మారింది. కొన్ని స్థానాలు ఫిక్స్ అయినా మరికొన్ని స్థానాల కోసం మాత్రం పోటీ ఉంది. కెప్టెన్ గిల్ 4వ స్థానంలో బ్యాటింగ్ దిగుతాడని ఇప్పటికే పంత్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో యశస్వి జైశ్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశాలే ఎక్కువ. మూడో స్థానం కోసం అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్ పోటీపడుతున్నారు. ఇద్దరూ నిలకడగా రాణిస్తుండటంతో ఎవరిని సెలెక్ట్ చేయాలన్నది తలనొప్పిగా మారింది. ఎవరికి చోటు దక్కినా వారికి ఇదే తొలి టెస్టు కానుంది. పంత్ 5వ స్థానంలో రానున్నాడు. ఇక, 8ఏళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు ఖాయమే. నలుగురి పేసర్లను తీసుకుంటే తుది జట్టులో అతనే ఏకైక స్పిన్నర్ అవ్వొచ్చు. అదే జరిగితే కుల్దీప్ బెంచ్‌కే పరిమితమవుతాడు. పేస్ దళాన్ని బుమ్రా నడిపించనుండగా మరో పేసర్‌గా సిరాజ్‌కు చోటు ఖరారే. ఇంకో స్థానం కోసం ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ మధ్య పోటీ నెలకొంది. శార్దూల్ ఠాకూర్, నితీశ్ కుమార్‌లలో ఒకరు పేస్ ఆల్‌రౌండర్‌గా తుది జట్టులో ఉండనున్నారు.
ఇంగ్లాండ్ 51.. భారత్ 35
ఇరు జట్ల మధ్య టెస్టు పోరులో ఇంగ్లాండ్‌దే ఆధిపత్యం. భారత్, ఇంగ్లాండ్ జట్లు ఇప్పటివరకు 136 టెస్టుల్లో తలపడ్డాయి. అందులో 51 విజయాలతో ఇంగ్లాండ్‌దే పైచేయి. భారత్ 35 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మరో 50 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే, 2021 నుంచి ఇంగ్లాండ్‌పై భారత జట్టు పైచేయి సాధిస్తోంది. అప్పటి నుంచి 14 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 9 విజయాలు నమోదు చేసింది. ఇంగ్లాండ్ నాలుగుసార్లే గెలిచింది. మరో మ్యాచ్ డ్రా అయ్యింది.
ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చంటే?
హెడింగ్లీ స్టేడియంలో నేటి నుంచి 24 వరకు తొలి టెస్టు జరగనుంది. భారత కాలమానం ప్రకారం ప్రతి రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్‌లో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ చానెల్‌లో మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ కానుంది. అలాగే, జియో హాట్‌స్టార్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో కూడా మ్యాచ్‌ను వీక్షించొచ్చు.






