తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి.. ఆస్ట్రేలియా భారీ విజయం

by Harish |

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు ఓటమితో మొదలుపెట్టింది.

తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి.. ఆస్ట్రేలియా భారీ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు ఓటమితో మొదలుపెట్టింది. న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు ప్రతీక రావల్(64), స్మృతి మంధాన(58) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 114 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం హర్లీన్ డియోల్(54) కూడా రాణించి స్కోరును 200 దాటించింది. అయితే, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(11), జెమిమా రోడ్రిగ్స్(18), రిచా ఘోష్(25), దీప్తి శర్మ(20 నాటౌట్) మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. చివరికి భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 రన్స్ చేసింది. 282 పరుగుల టఫ్ టార్గెట్‌ను భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఆ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం రెండే వికెట్లు కోల్పోయి 44.1 ఓవర్లలోనే ఛేదించింది. లిచ్‌ఫీల్డ్(88), బెత్ మూనీ(77 నాటౌట్), సుదర్లాండ్(54 నాటౌట్) చెలరేగడంతో ఆసిస్ అలవోకగా నెగ్గింది. బుధవారం రెండో వన్డే జరగనుంది.


Next Story