గిల్‌పై నమ్మకం ఉంది.. బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడలేడు.. కీలక వ్యాఖ్యలు చేసిన అజిత్ అగార్కర్

by Harish |

సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత జట్టును సమర్థవంతంగా నడిపిస్తాడనే గిల్‌ను కెప్టెన్ చేశామని, అతనిపై తమకు విశ్వాసం ఉందని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు.

గిల్‌పై నమ్మకం ఉంది.. బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడలేడు.. కీలక వ్యాఖ్యలు చేసిన అజిత్ అగార్కర్
X

దిశ, స్పోర్ట్స్ : సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత జట్టును సమర్థవంతంగా నడిపిస్తాడనే గిల్‌ను కెప్టెన్ చేశామని, అతనిపై తమకు విశ్వాసం ఉందని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. ఇంగ్లాండ్ టూరుకు జట్టు ప్రకటన సందర్భంగా ముంబైలో శనివారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అగార్కర్ పలు విషయాలు గురించి మాట్లాడాడు. కెప్టెన్‌గా గిల్‌‌ను నియమించడంపై స్పందిస్తూ.. ఇది చాలా పెద్ద మార్పు అని, గిల్‌ను తాము నమ్ముతున్నామన్నాడు. టెస్టుల్లో టీమిండియాను అతను ముందుకు తీసుకెళ్లాడన్న ఆత్మవిశ్వాసం తమకు ఉందన్నాడు.

కోహ్లీ, రోహిత్, అశ్విన్ రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ..‘వారిని భర్తీ చేయడం అంత సులభం కాదు. వారు దిగ్గజ క్రికెటర్లు. ఏప్రిల్ ఆరంభంలో కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తామని చెప్పాడు. అతని నిర్ణయాన్ని గౌరవించాలి. అలాగే, రోహిత్, అశ్విన్‌లను కూడా. వారిని మేము మిస్ అవుతాం.’ అని చెప్పాడు. అలాగే, బుమ్రా ఐదు టెస్టుల సిరీస్‌కు పూర్తిగా అందుబాటులో ఉండటంపై అగార్కర్ అనుమానం వ్యక్తం చేశాడు. పనిభారంగా కారణంగా అతను మూడు లేదా నాలుగు మ్యాచ్‌లు ఆడొచ్చన్నాడు. దేశవాళీలో, కౌంటీ క్రికెట్‌లో అనుభవం దృష్ట్యానే కరుణ్ నాయర్‌ను ఎంపిక చేశామన్నాడు. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేసినా ఆ తర్వాత పరుగులు సాధించలేదని, కొన్నిసార్లు టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోకతప్పదని చెప్పాడు. శ్రేయస్ అయ్యర్‌కు చోటు కల్పించకపోవడంపై స్పందిస్తూ.. ప్రస్తుతం అతనికి టెస్టు జట్టులో స్థానం కల్పించలేమన్నాడు. సాయి సుదర్శన్‌ను కొంతకాలంగా పర్యవేక్షిస్తున్నామని, అతని ఆట రెడ్ బాల్ క్రికెట్‌కు సరిపోతుందని తెలిపాడు.


Next Story