Hockey Asia Cup : తొలి మ్యాచ్‌లోనే భారత్ బోణీ.. చైనాపై సంచలన విజయం

by Harish |

హాకీ ఆసియా కప్‌లో భారత్ తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది.

Hockey Asia Cup : తొలి మ్యాచ్‌లోనే భారత్ బోణీ.. చైనాపై సంచలన విజయం
X

దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై జరుగుతున్న హాకీ ఆసియా కప్‌లో భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. టోర్నీని విజయంతో ఆరంభించింది. శుక్రవారం బిహార్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-3 తేడాతో చైనాను మట్టికరిపించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, చైనా కూడా గట్టిగానే పోరాడింది. మ్యాచ్‌లో తొలి గోల్ కూడా ఆ జట్టుదే. 12వ నిమిషంలో షిహాహో డు చైనా తరపున గోల్ చేశాడు. ఆ తర్వాత భారత్ పుంజుకుంది. 18వ నిమిషంలో జుగ్‌రాజ్ సింగ్, 20వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ చెరో గోల్ చేయడంతో ఫస్టాఫ్ ముగిసే సమయానికి భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ఆ కాసేపటికే హర్మన్‌ప్రీత్ మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. అప్పుడు భారత్ 3-1తో పట్టు సాధించింది. కానీ, చైనా దూకుడు పెంచడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 35వ నిమిషంలో, 41వ నిమిషంలో చైనా రెండో గోల్స్ చేసి స్కోరును 3-3తో సమం చేయడంతో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ మొదలైంది. ఈ సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ జట్టును ఆదుకున్నాడు. 47వ నిమిషంలో గోల్ చేసి 4-3తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత చైనాను మరో గోల్ చేయకుండా భారత్ నిలువరించింది. భారత్ ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది. మరో మ్యాచ్‌లో కజకిస్థాన్‌పై 0-7తో జపాన్ నెగ్గింది. అలాగే, బంగ్లాదేశ్‌పై 1-4తో మలేసియా విజయం సాధించగా.. సౌత్ కొరియా 7-0 తేడాతో చైనీస్ తైపీని ఓడించింది.


Next Story