మన జ్యోతి అదరగొట్టింది.. ఆర్చరీ వరల్డ్ కప్‌లో స్వర్ణం కైవసం

by Harish |

ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 టోర్నీలో తెలుగమ్మాయి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నెం జ్యోతి సురేఖ స్వర్ణ పతకం సాధించింది.

మన జ్యోతి అదరగొట్టింది.. ఆర్చరీ వరల్డ్ కప్‌లో స్వర్ణం కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : మన జ్యోతి అదరగొట్టింది. అమెరికాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 టోర్నీలో తెలుగమ్మాయి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నెం జ్యోతి సురేఖ స్వర్ణ పతకం సాధించింది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రిషబ్ యాదవ్‌తో కలిసి విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్‌లో జ్యోతి-రిషబ్ జోడీ 153-151 తేడాతో చైనీస్ తైపీకి చెందిన హువాంగ్ ఐ జౌ-చెన్ చిహు లిన్ జంటపై విజయం సాధించింది. జ్యోతి జంటకు ముందుగా ఆశించిన ఆరంభం దక్కలేదు. తొలి రెండు సెట్లలో(37-38, 37-39) చైనీస్ తైపీ ఆర్చరీలే ఆధిపత్యం ప్రదర్శించారు. రెండు సెట్లు ముగిసే సరికి 75-77తో వెనుకబడిన జ్యోతి, రిషబ్ ఆ తర్వాత పుంజుకున్నారు. మూడో సెట్‌లో 39-38తో నెగ్గి ప్రత్యర్థులు లీడ్‌ను 114-115తో తగ్గించారు. ఇక, నాలుగో సెట్‌లో సత్తాచాటిన జ్యోతి, రిషబ్ 39-36తో సత్తాచాటి మొత్తంగా రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించారు. వరల్డ్ కప్‌ టోర్నీల్లో జ్యోతికి ఇది 9వ స్వర్ణం కావడం విశేషం. రిషబ్‌కు ఇది తొలి వరల్డ్ కప్ గోల్డ్. మరోవైపు, టోర్నీలో భారత్‌కు ఇది తొలి స్వర్ణం. మొత్తంగా రెండోవది. పురుషుల కాంపౌండ్ జట్టు కాంస్యం నెగ్గిన విషయం తెలిసిందే.


Next Story