- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Champions Trophy : నేడే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. భారత్ టైటిల్ గెలుస్తుందా?
చాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. దుబాయ్ వేదికగా నేడే టైటిల్ పోరు.

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. దుబాయ్ వేదికగా నేడే టైటిల్ పోరు. ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి టీమిండియా సిద్ధమైంది. టోర్నీలో రోహిత్ సేన ఒక్క మ్యాచ్‌లోనూ ఓడలేదు. వరుస విజయాలతో జోరు మీద ఉన్నది. మరోవైపు, కివీస్ కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. బలబలాలపరంగా ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. దీంతో టైటిల్ పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే, గ్రూపు దశలో న్యూజిలాండ్‌ను టీమిండియా ఓడించిన విషయం తెలిసిందే. అలాగే, వరుసగా గత ఆరు వన్డేల్లో ప్రత్యర్థిపై విజయాలు నమోదు చేసింది. ఇది భారత ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేదే. అయినప్పటికీ కివీస్‌ను సులభంగా తీసుకోవద్దని విశ్లేషకులు చెబుతున్నారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజయం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. 2002, 2013లలో చాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 2017లోనూ ఫైనల్‌కు చేరుకున్నా పాక్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు తిరిగి మళ్లీ టైటిల్ దక్కించుకునే అవకాశం భారత్‌కు వచ్చింది. మరి, 12 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించుతుందో లేదో చూడాలి. విజేతగా నిలిస్తే టోర్నీ చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన జట్టుగా టీమిండియా నిలుస్తుంది.
ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయాల్సిందే
ఫైనల్‌లో బలమైన న్యూజిలాండ్‌ను ఓడించాలంటే భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయాల్సిందేనని విశ్లేషకులు సూచిస్తున్నారు. బ్యాటింగ్ పరంగా జట్టుకు ఢోకా లేదు. శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణిస్తుండటం సానుకూలంశం. ఇక, పెద్ద మ్యాచ్‌లంటే రెచ్చిపోయే కోహ్లీపై భారీ అంచనాలు ఉన్నాయి. గ్రూపు దశలో పాక్‌పై అజేయ శతకంతో జట్టుకు విజయాన్ని కట్టబెట్టిన అతను ఆస్ట్రేలియాతో సెమీస్‌లోనూ 84 రన్స్‌తో సత్తాచాటాడు. ఫైనల్‌లోనూ అతను రాణించాలని జట్టుతోపాటు అభిమానులు ఆశిస్తున్నారు. హార్దిక్, రాహుల్ కూడా సందర్భాన్ని బట్టి ఆడుతున్నారు. ఓపెనర్ గిల్ గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశపర్చినా అతని సామర్థ్యంపై అనుమానాలు అక్కర్లేదు. అయితే, కెప్టెన్ రోహిత్ మాత్రం దూకుడుగా ఆడుతూ త్వరగానే అవుటవుతుండటం జట్టును ఆందోళన కలిగిస్తున్నది. ఫైనల్‌లో అతను భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉన్నది. గిల్, రోహిత్ జట్టుకు భారీ శుభారంభం అందిస్తే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయమే. ఇక, స్పినే భారత్ ప్రధాన బలమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లతో కూడిన స్పిన్ దళం ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నది. మరోవైపు, షమీ, పాండ్యా కూడా పేస్ దళాన్ని చక్కగా నడిపిస్తున్నారు. పటిష్టమైన బ్యాటింగ్ దళం ఉన్న కివీస్‌ను కట్టడి చేయాలంటే భారత బౌలర్లు శక్తిమించి పోరాటం చేయాల్సిందే.
కివీస్‌తో అంత ఈజీ కాదు
న్యూజిలాండ్‌తో భారత్‌కు సవాల్ తప్పదు. ఆ జట్టు బలబలాల పరంగా టీమిండియాకు ఏం తక్కువ కాదు. టోర్నీలో భారత్ మ్యాచ్‌లో మినహా అన్నింటి విజయాలు సాధించింది. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ నిలకడగా రాణిస్తూ కివీస్‌కు ప్రధాన బలంగా మారారు. డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ కూడా ప్రమాదకరమే. మొత్తంగా కివీస్ బ్యాటింగ్ దళం బలంగా ఉంది. మరి, భారత బౌలర్లు వారిని ఏ మేరకు కట్టడి చేస్తారన్న దానిపైనే టీమిండియా విజయం ఆధారపడి ఉన్నది. పేసర్ మ్యాట్ హెన్రీ గాయం కారణంగా ఫైనల్ ఆడటంపై సందిగ్ధం నెలకొంది. అతను దూరమైతే కివీస్‌కు భారీ దెబ్బే. ప్రస్తుతం అతను టోర్నీలో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. అతని స్థానంలో జాకబ్ డఫీ ఆడే చాన్స్ ఉంది. బౌలర్లు కెప్టెన్ శాంట్నర్, విలియమ్ ఒరౌర్కె నిలకడగా రాణిస్తున్నారు. మొత్తంగా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా సమవుజ్జీగా కనిపిస్తున్న కివీస్‌పై విజయం సాధించడం భారత్‌కు అంత సులభమైతే కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్ 61.. కివీస్ 50
వన్డేల్లో న్యూజిలాండ్‌పై భారత్‌దే ఆధిపత్యం. ఇప్పటి వరకు ఇరు జట్లు 119 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అందులో టీమిండియా 61 విజయాలు నమోదు చేసింది. కివీస్ 50 మ్యాచ్‌ల్లో నెగ్గింది. 7 మ్యాచ్‌లు రద్దవ్వగా.. ఒక్క మ్యాచ్ టై అయ్యింది. అయితే, ఐసీసీ ఈవెంట్లలో ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. 12 మ్యాచ్‌ల్లో భారత్, కివీస్ చెరో 6 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. మరోవైపు, కొంతకాలంగా కివీస్‌పై భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. అయితే, న్యూజిలాండ్‌తో ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్‌కు గొప్ప రికార్డు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. నాలుగు నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఒక్క విజయమే సాధించింది. 2023 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో మాత్రమే గెలిచింది. చాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్‌తోపాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్-2021 ఫైనల్‌లో, వన్డే వరల్డ్ కప్-2019 సెమీస్‌లో భారత జట్టు కివీస్ చేతిలో ఓడిపోయింది.
టెన్షన్ పెడుతున్న ఫైనల్ ఫోబియా
ఐసీసీ ఈవెంట్స్ అనగానే టీమిండియాకు ఉన్న ఫైనల్ ఫోబియా ఫ్యాన్సను టెన్షన్ పెడుతుంటుంది. టోర్నీ ఆద్యంతం సంచలన ప్రదర్శనతో ఆకట్టుకునే భారత్ టైటిల్ పోరులో మాత్రం బోల్తా పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.గత చాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్‌లో పాక్ చేతిలో పరాజయం పాలైంది. 2014 టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక చేతిలో ఓటమి నుంచి బయటపడలేకపోయింది. ఇక, వన్డే వరల్డ్ కప్‌లో 2003లో, 2023లో ఫైనల్‌లోనే బోల్తా పడింది. భారత్‌లో జరిగిన గత వన్డే ప్రపంచకప్‌లో వరుసగా 10 విజయాలతో జైత్రయాత్ర కొనసాగించిన రోహిత్ సేనకు ఫైనల్‌లో ఆస్ట్రేలియా షాకిచ్చిన విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో బోల్తా పడింది. ఇలా 2013 చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత ఐదు సందర్భాల్లో ఫైనల్‌లోనే భంగపాటుకు గురైంది. అయితే, గతేడాది టీ20 వరల్డ్ కప్ విజయంతో భారత జట్టు ఫైనల్ ఫోబియాకు చెక్ పెట్టింది. ఈ సారి కూడా టీమిండియా విజయఢంకా మోగిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
తుది జట్లు(అంచనా)
భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి
న్యూజిలాండ్ : డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, శాంట్నర్(కెప్టెన్), కైల్ జేమీసన్, విలియమ్స్ ఓరౌర్కె, జాకబ్ డఫీ






