IND VS ENG : తొలి రోజే 6 వికెట్లు డౌన్.. కష్టాల్లో టీమిండియా

by Harish |

ఐదో టెస్టును టీమిండియా పేలవంగా ప్రారంభించింది.

IND VS ENG : తొలి రోజే 6 వికెట్లు డౌన్.. కష్టాల్లో టీమిండియా
X

దిశ, స్పోర్ట్స్ : ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లండన్‌లోని ది ఓవల్ స్టేడియంలో గురువారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు మొదలైంది. ప్రస్తుతం సిరీస్‌లో 2-1తో భారత్ వెనుకబడగా సిరీస్ కోల్పోవద్దంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. అంతటి కీలకమైన ఐదో టెస్టును టీమ్ ఇండియా పేలవంగా మొదలుపెట్టింది. బ్యాటుతో దారుణంగా తడబడింది. జైశ్వాల్(2), రాహుల్(14), గిల్(21), సుదర్శన్(38)‌లతో కూడిన టాపార్డర్ విఫలమైంది. జడేజా(9), జురెల్(19) కూడా చేతులెత్తేశారు. దీంతో తొలి రోజే భారత్ తీవ్ర కష్టాల్లో పడగా.. కరుణ్ నాయర్(52 బ్యాటింగ్) కాస్త ఊరటనిచ్చే విషయం. నాయర్‌తోపాటు సుందర్(19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. శుక్రవారం నాయర్, సుందర్ భారీ స్కోర్లు నమోదు చేస్తేనే మ్యాచ్‌లో భారత్ పోటీలో ఉంటుంది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తీవ్రంగా తడబడింది. పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో పరుగులు చేయడానికి భారత బ్యాటర్లు కష్టపడాల్సి వచ్చింది. ఆ ఒత్తిడిలో వికెట్లు కోల్పోయారు. ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. యశస్వి జైశ్వాల్(2) ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. కేఎల్ రాహుల్(14) క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిగా.. అతన్ని క్రిస్ వోక్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం సాయి సుదర్శన్(38), గిల్(21) కలిసి కాసేపు ఇన్నింగ్స్ గాడిలో పెట్టే ప్రయత్నం చేసినా ఫలించలేదు. గిల్ రనౌట్ అవ్వగా.. ఆ కాసేపటికే సుదర్శన్ కూడా వికెట్ కోల్పోయాడు. క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(9) కూడా ఎంతో సేపు లేడు. దీంతో భారత్ 123 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో కరుణ్ నాయర్ జట్టును ఆదుకునేందుకు పోరాడుతున్నాడు. హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గత మ్యాచ్‌ల్లో ఆకట్టుకోని అతను చివరి చాన్స్‌ను అందిపుచ్చుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ భారత్‌‌కు అండగా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ కూడా మరో అద్భుతమైన ఇన్నింగ్స్ దిశగా సాగుతున్నాడు. వీరి పోరాటంతో భారత్ అతికష్టం మీద 200 పరుగుల మార్క్‌ను దాటింది. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్సన్, జోష్ టంగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

Next Story