IND VS ENG : నేటి నుంచే ఐదో టెస్టు షురూ.. భారత్ సిరీస్‌ను సమం చేస్తుందా?

by Harish |

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేటి నుంచి ఐదో టెస్టు ప్రారంభంకానుంది.

IND VS ENG : నేటి నుంచే ఐదో టెస్టు షురూ.. భారత్ సిరీస్‌ను సమం చేస్తుందా?
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ గడ్డపై గిల్ సేన కీలకమైన పోరుకు సిద్ధమైంది. నాలుగో టెస్టులో తృటిలో ఓటమి నుంచి బయటపడిన టీమిండియా సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. చివరి రోజు సుందర్, జడేజా వీరోచిత పోరాటంతో ఆ మ్యాచ్‌‌ను డ్రా చేసుకుంది. అయితే, భారత్‌కు ఇంకా ముంపు పొంచే ఉంది. ప్రస్తుతం సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఆఖరి మ్యాచ్‌లో ఆ జట్టు కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ సొంతమవుతుంది. కాబట్టి, టీమిండియాకు ఐదో టెస్టు చావోరేవో లాంటింది. నేటి నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది. లండన్‌లోని ఓవల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక. సిరీస్ ఓటమి నుంచి బయటపడాలంటే టీమిండియా కచ్చితంగా గెలవాల్సిందే. మరో దారి లేదు. డ్రా చేసుకునే సిరీస్ ఓటమి తప్పదు. దీంతో ఓవల్‌లో గెలిచి సిరీస్‌ను 2-2 సమం చేయాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగబోతున్నది. బ్యాటింగ్ పరంగా టీమిండియాకు ఢోకా లేదనే చెప్పాలి. పంత్ దూరమవడం దెబ్బే. కానీ, జైశ్వాల్, రాహుల్, గిల్‌, సుదర్శన్‌, జడేజా, సుందర్‌లతో బ్యాటింగ్ దళం పటిష్టంగానే ఉంది. అయితే, బౌలింగ్ పరంగా సరిదిద్దుకోవాల్సిన లోపాలు కొన్ని ఉన్నాయి. స్టార్ బౌలర్లు బుమ్రా, సిరాజ్ నాలుగో టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ చాలా కీలకం కానున్నారు. మొత్తంగా ఐదో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయడం ఒక్కటే విజయానికి మార్గం.

అర్ష్‌దీప్ అరంగేట్రం?

యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐదో టెస్టులో అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నాలుగో టెస్టులోనే అతను డెబ్యూ చేస్తాడని వార్తలు వచ్చినా గాయం కారణంగా కుదరలేదు. అన్షుల్ కాంబోజ్‌ను తీసుకున్నారు. అయితే, ఐదో టెస్టులో అర్ష్‌దీప్ ఆడటంపై కెప్టెన్ గిల్ హింట్ ఇచ్చాడు. అర్ష్‌దీప్‌కు సిద్దంగా ఉండాలని చెప్పామని, కానీ, పిచ్ చూసిన తర్వాతే తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తీసుకునే ఆలోచన లేదన్నట్టు గిల్ మాట్లాడాడు. జడేజా, సుందర్ రూపంలో స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాడు. కుల్దీప్‌ ఆఖరి టెస్టులోనూ బెంచ్‌కే పరిమితం కాకతప్పదు. బుమ్రా ఆడతాడా?లేదా? అనేది గురువారమే నిర్ణయం తీసుకుంటామని గిల్ చెప్పాడు. ఇంగ్లాండ్ పర్యటనలో బుమ్రా మూడు టెస్టులే ఆడతాడని టీమ్ మేనేజ్‌మెంట్ చెప్పింది. బుమ్రా ఇప్పటికే మూడు టెస్టులు ఆడేశాడు. దీంతో ఐదో టెస్టు ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే, సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో బుమ్రా ఆడే చాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గాయం కారణంగా పంత్ దూరమైన విషయం తెలిసిందే. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ బాధ్యతలు మోయనున్నాడు.

ఓవల్‌లో ప్రత్యర్థిదే పైచేయి

ఇంగ్లాండ్‌లోని అన్ని స్టేడియాల మాదిరిగానే ఓవల్ స్టేడియంలో కూడా భారత్‌పై ఇంగ్లాండ్‌దే పైచేయి. ఆ స్టేడియంలో ఇరు జట్లు ఇప్పటివరకు 15 సార్లు తలపడ్డాయి. అందులో రెండేసార్లు భారత్ గెలిచింది. ఇంగ్లాండ్ ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే, ఓవల్‌లో భారత్‌కు గొప్ప రికార్డు లేకపోయినా ప్రదర్శనను మాత్రం పూర్తిగా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే 7 మ్యాచ్‌ల్లో డ్రా చేసుకుంది. ఓవల్‌లో 2011లో చివరిసారిగా తలపడగా అప్పుడు టీమిండియానే విజయం సాధించింది.

బ్యాటర్లకు పండగే

ఓవల్ స్టేడియం హై స్కోర్లకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి, ఆ మైదానంలో ఇరు జట్ల బ్యాటర్ల పండగ చేసుకోనున్నారు. ఇటీవల కౌంటీ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో సర్రే క్లబ్ ముందుగా బ్యాటింగ్ చేసి 820 స్కోరు చేయడం గమనార్హం. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకు స్వల్ప ప్రయోజనం ఉంటుందని అంచనా. అయితే, మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. తొలి రోజు వరుణుడు ఆటకు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ నివేదికలు అంచనా వేశాయి.

Next Story