- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND vs ENG : నాలుగో టెస్టుపై పట్టు బిగించిన ఇంగ్లాండ్.. 186 పరుగుల ఆధిక్యం
భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టుపై ఇంగ్లాండ్ పట్టు బిగించింది.

దిశ, స్పోర్ట్స్ : నాలుగో టెస్టులో మూడో రోజు కూడా ఇంగ్లాండ్‌దే. ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పట్టు బిగించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు బజ్‌బాల్ ఆటతో విజృంభించడంతో ఆ జట్టు తిరుగులేని స్థితిలో నిలిచింది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 544 స్కోరు వద్ద నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 225/2తో ఆ జట్టు ఆట కొనసాగించగా.. జోరూట్(150) భారీ శతకంతో కదం తొక్కాడు. ఓలీ పోప్(71) కూడా సత్తాచాటాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. ఐదు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించిన కెప్టెన్ బెన్ స్టోక్స్(77 బ్యాటింగ్) బ్యాటుతోనూ చెలరేగాడు. స్టోక్స్‌తోపాటు డాసన్(21బ్యాటింగ్) కూడా క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. నాలుగో రోజైన గిల్ సేన పుంజుకోకుంటే ఓటమి తప్పదు. అదే జరిగితే సిరీస్ ఆశలు గల్లంతైనట్టే.
రూట్ నిలబడి..
మూడో రోజు కూడా ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఆ జట్టుకు ఎదురులేకుండా పోయింది. ముఖ్యంగా జోరూట్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. 11 రన్స్‌తో మూడో రోజును కొనసాగించిన అతను క్రీజులో పాతుకపోయాడు. అతన్ని అవుట్ చేసేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిదానంగా ఆడుతూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 38వ శతకాన్ని పూర్తి చేశాడు. రూట్ తర్వాత ఓలీ పోప్, స్టోక్స్ కూడా మూడో రోజు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు దిశగా వెళ్తున్నది. రూట్ క్రీజులో పాతుకపోయి భారత్ వ్యూహాలను తిప్పికొట్టాడు. పోప్, స్టోక్స్ కూడా ఆచితూచి ఆడుతూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. పోప్‌తో కలిసి రూట్ 144 రన్స్ జోడించాడు. స్టోక్స్‌తో కలిసి 142 పరుగులు జత చేశాడు. అయితే, ఒక దశలో భారత బౌలర్లకు పుంజుకునే అవకాశం వచ్చింది. సుందర్ స్వల్ప వ్యవధిలోనే పోప్, హ్యారీ బ్రూక్(3)ను అవుట్ చేసి భారత్‌కు ఊరటనిచ్చాడు. కానీ, ఆ అవకాశాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. బుమ్రా, సిరాజ్ చెరో వికెట్ తీయడం మినహా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. జడేజా, సుందర్ చెరో 2 వికెట్లతో పర్వాలేదనిపించారు.
సచిన్ తర్వాత రూటే
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో 150 పరుగులు చేసి భారీ శతకాన్ని నమోదు చేశాడు. దీంతో టెస్టుల్లో 13,409 రన్స్ పూర్తి చేసిన రూట్ కీలక మైలురాయిని సాధించాడు. టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌కు ముందు అతను 13, 259 రన్స్‌తో ఆ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా రాహుల్ ద్రవిడ్(13,288), జాక్వెస్ కల్లీస్(13,289), రికీ పాంటింగ్(13,378)లను వెనక్కినెట్టాడు. ఈ జాబితాలో సచిన్(15,921) అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ కంటే రూట్ ఇంకా 2,512 రన్స్ వెనకబడి ఉన్నాడు. కొంతకాలంగా టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న రూట్.. సచిన్‌ను కూడా అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, టెస్టుల్లో భారత్‌పై అత్యధిక సెంచరీలు(12) చేసిన ప్లేయర్‌గా రూట్ రికార్డు సాధించాడు. అలాగే, సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుమార సంగక్కర(38)తో కలిసి రూట్ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్(51), కల్లీస్(45), రికీ పాంటింగ్(41) వారి కంటే ముందున్నారు.






